సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-222
రుమాలశు నార్ఘ న్యాయము
******
రుమ అంటే ఉప్పళము, ఉప్పు గని, సుగ్రీవుని భార్య అనే అర్థాలు ఉన్నాయి.లశునము అంటే వెల్లుల్లి, కెంపునందలి దోష విశేషము.ఆర్ఘము అంటే వెల, పూజించుట అనే అర్థాలు కలవు.
ఉప్పు కొటారులో లేదా  కేవలం ఉప్పు గని  లేదా అమ్మే దుకాణం దగ్గరకు వెళ్ళి వెల్లుల్లి పాయ ధర ఎంతని అడిగినట్లు.
 అంటే సంబంధం లేని మాటలు మాట్లాడుట లేదా అసందర్భంగా మాట్లాడుట అని అర్థం.
ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, పొంతన లేకుండా మాట్లాడే వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ రుమాలశు నార్ఘ న్యాయమును ఉదాహరణగా మన పెద్దలు చెబుతుంటారు.
 వీటినే 'తెలుగులో"తలతిక్క ప్రశ్నలు" అంటుంటారు.
 గుళ్ళో  రామాయణం వినడానికి వచ్చాడట ఓ వ్యక్తి. చివర్లో రామాయణం అయిపోయాక చెప్పే పెద్దమనిషి దగ్గరకు వెళ్ళి "అయ్యా !ఇంతకీ రాముడికి సీత ఏమవుతుంది?"అన్నాడట. ఆ ప్రశ్న విన్న తర్వాత  రామాయణం గురించి చెప్పిన పెద్ద మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
 ఇలాంటి అసందర్భ ప్రశ్నలు సరదా సమయంలో అనుకుంటే నవ్వొస్తుంది.అదే మనం  పనులతో హడావిడిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తే చిరాకు, కోపం వస్తుంది.
కొందరు వ్యక్తులు ఏదో విషయం గురించి తీవ్రంగా చర్చిస్తూ, మాట్లాడుకుంటుంటే వారి మధ్యలో  ఓ వ్యక్తి దూరాడు . అంతటితో ఆగకుండా అందులోని ఒకతనితో మాటలు కలుపుతూ "ఏమండీ! మీకు పెళ్ళయ్యిందా? అనడిగితే లోలోపల చిరాగ్గా ఉన్నా పైకి కనిపించకుండా 'కాలేదండీ.' అని మర్యాదగా సమాధానం ఇచ్చాడట.అంతటితో ఆగకుండా 'మీకు పిల్లలు ఎంత మందండీ? అన్నాడట. ఇక ఆ ప్రశ్నకు తోక తొక్కిన తాచులా లేచి "అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావ్? అని ఏకవచనంలో చెడామడా తిట్టేసరికి అప్పుడు అర్థమైందట అడిగిన వ్యక్తికి తను చేసిన తప్పేంటో.
ఇలాంటివి అవధాన ప్రక్రియలో కూడా ఉంటాయి. కాకపోతే అవి  అవధాని యొక్క ధారణా శక్తిని ఏకాగ్రతను భంగ పరిచేందుకు తద్వారా అవధాని యొక్క ప్రతిభా పాటవాలను ప్రజలకు తెలియ జెప్పేందుకు ఇలాంటి  అసందర్భ ప్రశ్నలు వేసే పృచ్ఛకుడు ఒకరు అవధానంలో ఉంటారు.
 అవధాని క్లిష్టమైన సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పద్యాలను అలవోకగా పూరిస్తూ ఉన్న సమయంలో అప్రస్తుత ప్రసంగి అయిన పృచ్ఛకుడు కొంచెం అసందర్భ ప్రశ్నలతో అవధాని గారి ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ సమాధానాలు కోరుతుంటాడు.
అవి ఎలాంటివంటే మనవాళ్ళు సరదాగా భావించే, సహనాన్ని పరీక్షించే తలతిక్క ప్రశ్నల లాంటివన్న మాట.
 మరి ఓ ఉదాహరణ చూద్దామా...
అవధాని గారూ! భర్త 'పశువ' అన్నాడు.అది విన్న భార్య కోపగించుకోకుండా 'కోతి' అన్నది .అయినా వాళ్ళిద్దరూ పోట్లాడుకోకుండా సంతోషంగా ఉన్నారు.అలా తిట్టుకోవడం వాళ్ళకు సరదానా! అని  అప్రస్తుత ప్రసంగి అడిగిన ప్రశ్నలకు  అవధాని నవ్వుతూ భర్త అన్న 'పశువ'కు అర్థం పళ్ళెం నిండా శుభ్రంగా వడ్డించు అని.ఇక భార్య అన్న 'కోతి' కి అర్థం 'కోరినంత తినండి' అని చెబుతాడు.
 ఇలా సంబంధం లేని మాటలు, అసందర్భ ప్రశ్నలు పై సందర్భాల్లో,సన్నివేశాల్లో రక్తి కట్టిస్తాయి. కానీ  మిగతా  సమయాల్లో ఎదుటి వ్యక్తులకు చిరాకును, కోపాన్ని తెప్పిస్తాయి.లేదా వారి అమాయకత్వానికి నవ్వుకునేలా చేస్తాయి.
మరి అలాంటి  సమయాల్లో ఈ "రుమాలశు నార్ఘ న్యాయము"ను గుర్తుకు తెచ్చుకుని చిరాకు పడతారో,నవ్వుకుంటారో  ఇక మీ ఇష్టమే సుమా!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు