నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 సింగినాదం - జీలకర్ర
===============
    ఇది చారిత్రక ఆధారంగా వచ్చిన నానుడి. 
      ఏదైనా భయంగొల్పే విషయమో, నష్టం కలిగించే విషయమో తెలిసినప్పుడు, అది నిజం కాదని, అభూత కల్పనని అనుకుంటే, దాన్ని కొట్టి  పారేయడానికి ఈ 'సింగినాదం జీలకర్ర' నానుడి వాడతారు. 
      ఎంతో భయం కలిగించే క్లిష్టమైన అంశాన్ని ఇట్టే కొట్టి పారేయాలంటే ఈ నానుడి వాడతారన్నమాట. ఈ మాట ఎలా పుట్టిందో చూద్దాం.
       పూర్వం మన దేశంతో మన తెలుగు రాష్ట్రాలుతో విదేశీయులు వర్తకం చేసేవారు. వారి దేశంలో పండే వాటిని ఓడలలో తీసుకు వచ్చి మన దేశంలో పండినవి, లేదా మనం తయారు చేసిన నేత వస్త్రాలు వారు  తీసుకు పోయేవారు. అంటే వస్తు మార్పిడితో వ్యాపారం జరిగేదన్నమాట. 
       మన రాష్ట్రంలో జీలకర్ర పండేది కాదు. అది అరబ్బుల పంట. జీలకర్ర మన ఆరోగ్యానికి ఆయువుపట్టు అని ఆయుర్వేదం చెబుతుంది. అది పైత్యానికి తిరుగులేని ఔషధం. అందుకే మనవారు దాన్ని విరివిగా కొనేవారు. ఆ వర్తకానికి అంత మక్కువ ఉండేది.
      అరబ్బులు జీలకర్రతో ఓడ దిగగానే , వారు వచ్చినట్టు గుర్తుగా కొమ్ములతో చేసిన బూరలతో శబ్దం చేసేవారు. ఈ శబ్దాన్ని శృంగనాదం అనేవారు. శృంగము అంటే కొమ్ము. నాదము అంటే మధురమైన శబ్దం. శృంగనాదం విని పించిందంటే జీలకర్ర ఓడలో వచ్చి సిద్ధంగా ఉందని అర్థం. వెంటనే గ్రామస్థులు వెళ్లి అరబ్బులకు కావలసిన వస్తువులో, ధాన్యమో ఇచ్చి జీలకర్ర తెచ్చుకునే వారు.
     ఇదిలా ఉండగా  కొందరు దొంగలు తయారయ్యారు. ఇలాగే శృంగనాదం చేయటం మొదలు పెట్టారు. జీలకర్ర వచ్చిందనుకుని గ్రామస్థులు  వారివారి వస్తువులతో వెళ్లేవారు. ఇదే అదునుగా చూసుకుని దొంగలు వారి వస్తువులు, ధాన్యం దోచుకొని వెళ్లేవారు. ఎదురు తిరిగిన వారిని కర్కశంగా చంపేవారు. కొన్నాళ్లకు ప్రజలు దీన్ని గుర్తించారు. శృంగనాదం నమ్మడం మానేశారు. ఈ శృంగనాదమే నోరు తిరగక  వాడుకలో సింగినాదంగా మారింది. ఇది సింగినాదం - జీలకర్ర కథ.
కామెంట్‌లు