ముందురోజే సెలబ్రేషన్స్ చేసి ఆగస్టు 15 న సెలవు తీసుకునే కాలం కాదది. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు అందరూ ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనవలసిందే!
నేను చదువుకున్నది పాతబస్తీలోని వెంకట్రావు మెమోరియల్ స్కూలు. ప్రభుత్వ పాఠశాల అయినా టీచర్లు చాలా బాగా చెప్పేవారు. చదువులో పోటీ ఆటల్లో పోటీ క్రమశిక్షణ విషయం లో కూడా శ్రద్ధ తీసుకునేవారు…. నేను రెండవ తరగతి లో ఆ స్కూలు లో చేరాను.నాలుగవ తరగతి నుండి ప్రతిరోజు వందేమాతరం , జాతీయ గీతం నేను నా స్నేహితురాలు సరస్వతి అనే అమ్మాయి పాడేవాళ్లం.
మా PET సర్ విఠ్ఠల్ రెడ్డిగారు… అనవసర కారణాలతో ఎవరైనా ఆ రోజు రాకపోతే ప్లేగ్రౌండ్ కి వారం రోజులు రానిచ్చేవారు కాదు. అందుకని సాధారణంగా ఎవరూ మానేసేనా వారు కాదు.
మా గ్రూప్ అమ్మాయిలు ఎనిమిది మందిమి పొద్దున ఆరింటి కే స్కూల్ కి చేరుకునే వాళ్లం …. PET మరియు NCC వాళ్లు కార్యక్రమ ఏర్పాట్లు చేస్తుంటే వాళ్లకు సహాయం చేసేవాళ్లం.
మా ఇంటినుండి స్కూల్ కి వెళ్లే దారంతా రంగురంగుల జండాల తోరణాలతో మైకుల్లో మోగే దేశభక్తి గీతాలతో పండగ వాతావరణం ఉండేది. ఆ తోరణాల కింద నడుస్తుంటే నాకు నేను మహా రాణినేమో అనిపించేది.గర్వంగా తలెత్తి నడిచేవాళ్లం.
ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకు స్వాతంత్ర్య దినోత్సవం రోజు తప్పకుండా వెళ్లాను . ఇంటర్ మీడియట్ లో అలవాటు ప్రకారం వనితకాలేజ్ కి వెళ్లాను…. అక్కడ నేను కాక పదిమంది వరకు ఉన్నారు . మరునాడు మా క్లాస్ మేట్స్ అంతా ఇది స్కూల్ అనుకున్నావా అంటూ గేలి చేసారు.ఆతర్వాత చదువు పూర్తి చేసి టీచర్ గా 30 సంవత్సరాలలో ఈ వేడుకలను ఎప్పుడూ మానలేదు… విశ్రాంత జీవనం లో ఏదో వెలితి , అపరాధ భావన కలిగి మా అపార్ట్ మెంట్ లో అలవాటు చేసి తృప్తి పడుతున్నాను.
స్వాతంత్య్ర దినోత్సవం- నా అనుభవాలు;-సుగుణ అల్లాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి