సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -241
వస్తు శక్తి న్యాయము
*****
వస్తు అంటే పదార్థము.శక్తి అంటే బలిమి, బలము అని అర్థము.
వస్తువుల యొక్క బలాబలములు దాని శక్తి ననుసరించి ఏర్పడుతాయి.
చిన్న గుండుసూదినో, మరేదైనా చిన్న వస్తువునో పట్టుకోవడం, తీయడం తేలిక.కానీ అదే పెద్దదైన బరువైన వస్తువులను తీయడం కానీ, పట్టుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే! అంటే వాటి శక్తి బలాబలాలను బట్టి ఏర్పడుతుంది.
క్రియమాణములవు కార్యముల యొక్క ఫలాఫలములు ఆ క్రియల మంచి చెడ్డలను బట్టి కలుగుతాయి అనే అర్థంతో ఈ "వస్తు శక్తి న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ న్యాయము చూడటానికి, చదవడానికి చిన్నగా వున్నా ఇందులో ఎంతో నిగూఢమైన అర్థం దాగి వుంది.
 మనిషి ఎదుర్కొనే సమస్యలకు,చేసే క్రియలకు, పొందే సంపాదనకు ... ఇలా అనేకానేక అంశాలతో దీనిని అన్వయించుకోవచ్చు.
దీనికి సంబంధించిన తెలుగు సామెత  చూద్దాం"ఎంత చెట్టుకు అంత గాలి" . అంటే చెట్టు  చిన్నదైతే తక్కువ గాలి, పెద్దదైతే ఎక్కువ గాలి వీచడం చాలా సహజం.
అలాగే సమస్యల విషయానికి వస్తే కూడా చిన్న చెట్టు పశుపక్ష్యాదుల నుండి ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్ద చెట్టుకు మనుషులు, పెద్ద పెద్ద గాలుల నుండి ఎదుర్కోవడం కష్టం అవుతుంది.
 దీనిని వ్యక్తుల సంపాదనకు ఉపయోగించి చూస్తే...కొంతమంది సంపాదించేది చూస్తుంటే "అబ్బో! బాగా సంపాదిస్తున్నాడే అనిపిస్తుంది కానీ ఆ సంపాదనకు తగిన ఖర్చులు కూడా వారికి వుంటాయి. అలా సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వారు ఆ స్థాయిలో ఉంటేనే చూసే వారికి బాగా అనిపిస్తుంది.అలా వుంటేనే స్థాయికి తగిన గౌరవం దక్కుతుంది అంటారు.
 అలా చేయడం వల్ల సదరు వ్యక్తులకు సమస్యలు కూడా వస్తాయి. పెరిగిన ఖర్చులను సమన్వయం చేసుకోలేక పోతే "పేరు గొప్ప ఊరు దిబ్బ" అయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇక చేసే పనులను బట్టి చూస్తే .. ఏదో చిన్న పని చేసి ఎక్కువ ఫలితాన్ని ఆశించడం సమంజసం కాదు కదా!
మనం చేసే పని మంచిదై సమాజానికి ఎక్కువ మేలు కలిగించేదై ఉంటే... ఆ దిశగా చేసే కృషి, ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
 ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిల్లో అర్హత సాధించాలంటే వాటికి సంబంధించిన అధ్యయనానికి చాలా సమయం కేటాయించాలి.ఎక్కువ శ్రమ పడాలి.అప్పుడే శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
 ఇలా కృషి,పట్టుదల, ఏకాగ్రత, పరోపకార చింతన కలిగి మనం చేసే శ్రమశక్తిని, సాధ్యాసాధ్యాలను బట్టి ఫలితాలు ఉంటాయని ఈ "వస్తు శక్తి న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు