గులాబీల దొంతర ..!!; - సుగుణ అల్లాణి
 నిజమే పసితనమంటే ఎవరికైనా మధురమే కదా! చూడడానికైనా ,చెప్పడానికైనా,తలుచుకోవడానికైనా!! 
ఎందుకంటే అమ్మ ఉంటుంది అక్కడ! అమ్మ మాట ,అమ్మ చూపు  ,అమ్మ నవ్వు ,
అమ్మ నడత ,అమ్మ చీర ,అమ్మ పెట్టుకునే  బొట్టు ,అమ్మ చిరాకు ,అమ్మ కోపం ,అమ్మ పాట ,అమ్మ చేతి వంట ,అమ్మ తిట్లుకూడా….. అన్నీ అద్భుతాలు …. అరవైఐదేళ్లు వచ్చినా అమ్మను తలుచుకోగానే జీవితమంటే ప్రేమ కలుగుతుంది. బతుకు మీద ఆసక్తి కలుగుతుంది .
ఇంకేంటి జీవితం చివరకొచ్చినాను అనుకుంటూ ఉండగా … మనుసులో అమ్మ మెదులగానే మొన్ననే కదా అమ్మ నాకు తలనిండా నూనె పెట్టి జడలేసింది… ఇలా ఏదో ఒక జ్ఞాపకం తలపుకు రాగానే మళ్లీ కొత్త ఆశ కొత్త శక్తి కొత్త ఉత్సాహం కలుగుతుంది…..
నాకు ఐదారేళ్ళు ఉన్నప్పటి నుండి జ్ఞాపకం……  అంటే కొంచం జ్ఞానం వచ్చేటప్పటికి  పెద్దన్నయ్య పెళ్ళి….తిరుపతి లో జరిగింది(తిరుపతిలో అని తర్వాత తెలిసింది)అదే నాకు లీలగా గుర్తొచ్చే మొదటి జ్ఞాపకం. నాగలక్ష్మిమా మేనమామ కూతురు నాతో ఆడుకుంటుండేది. మా 60 దశకం లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆరడుల ఆజానుబాహుడు అన్నయ్య … చిన్నగా సన్నగా గులాబీ రంగు కలిసిన తెలుపు పింగాణీ బొమ్మలా సుకుమారంగా సున్నితంగా ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న వదిన….. ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉండేది. వదినది కర్ణాటక . మా వదినకు ఫస్ట్ ఫ్రెండ్ నేనే! తెలుగు రాదు కదా….. దాన్నేమంటారు దీన్నేమంటారు అని చూపించి అడిగేది…. 
 ఓసారి వదినా నీలా తెల్లగా కావాలంటే ఏం చేయాలని అడిగానట…. దానికి మా శ్యామన్నయ్య ఇటుక పెట్టుకొని గట్టిగా రద్దుకో అన్నాడు …. నిజంగానే ఇటుక పెట్టి ముఖం రుద్దానట…. ఆ తర్వాతి కాలంలో నన్నేడిపించేవారందరూ!
పాతబస్తీ లాల్దర్వాజా!
నా హైస్కూల్ చదువంతా అక్కడే జరిగింది
ఒకటవ తరగతి లో వెంకట్రావు మెమోరియల్ స్కూల్ లో చేర్చారు.
ఐదేళ్లనుండే రేడియోలో పాటలు విని నేర్చుకునేదాన్ని! అదేంటో కానీ పుస్తకం లో పాఠాలు బుర్రకెక్కేవి కావు కానీ … ఒకటి రెండు సార్లు వింటే చాలు పాటలు వచ్చేసేవి!
నాదీ ఆడజన్మే సినిమాలోని పాట “ కన్నయ్యా !నల్లని కన్నయ్యా!! “ నాకిష్టమైన పాట … ఎవరు పాడమన్నా ఆ పాట ముందు పాడేదాన్ని!
రెండవ తరగతి లో అనుకుంటా! జగదంబ అనే అమ్మాయి … క్లాసు లో లక్షీబాయి టీచర్ పాడమంటే “ఇనుము చెలీ పలికెదనే పరమరగస్యం అంటూ పాడింది. నేను అది ఇనుము అనే అనుకున్నా! వినుము చెలీ అని చాలా రోజులకు అర్థమైంది…. ఏంటో ఎవరైనా పాడమనేదాలస్యం పాటందుకోడమే … పాడెయ్యడమే!బిడియము చూపించడం సిగ్గుపడడం ఏనాడూ లేవు.
బాల్యం మధురం
యవ్వనం కళ్లెం లేని గుర్రం
ఇప్పటి ఈ దశ వృద్ధాప్యం అని అనలేను ఎందుకంటే ఇంకా ఎన్నో చేయాలనే ఆకాంక్ష ఉన్నది … అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాము. కానీ బాగా మెల్లిగా నడుస్తున్న గడియారం లా అనిపిస్తూంది నాకు….
అయినా మధురమైన జ్ఞాపకాల 
గులాబీల దొంతరల్లో 
అనుభవాల చిక్కని తీయని తేనె 
మధురమే కదా!   
                    ***

కామెంట్‌లు