సుప్రభాత కవిత ; - బృంద
మబ్బులు మూసిన
తూరుపు వాకిట
మెరుపులు మెరిసేదెపుడో?

చీకటి నిండి వేచిన జగతికి
వెలుగులు పంచే వేకువ
వచ్చేదెపుడో?

అరమూసిన రెక్కల రెప్పలు
తెరిచి ముచ్చటగ విరబూసే
పువ్వులు నవ్వుల మురిసేదెపుడో?

గుండెను పేరుకున్న గుబులు
నులివెచ్చగ తాకి కుశలమడిగే
ఎండకు కరిగే దెప్పుడో?

మనసున రేగిన మంటలు
మాపేసి మురిపించు
కబురు వచ్చేదెపుడో?

ఆకాశమంత దిగులును
ఆవిరిచేసేలా ఆప్తబంధువు
రాక ఎప్పుడో?

బరువెక్కిన చిన్ని మనసు
ఆపేసిన కంటినీరు
ఆనందంగా కురిసేదెపుడో?

వేగుచుక్క కనిపించి
వెలుగుల జాతర జరిపించి
వెతలు తీరే కబురు వచ్చేదెప్పుడో?

ఎన్ని కలతలు కమ్ముకున్నా
ఎన్ని కష్టాలు ఎదురైనా
ఎదురుచూస్తున్న రేపటివెలుగును

కచ్చితంగా  తెచ్చు  కర్మసాక్షికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు