సునంద భాషితం -వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో 💐🎉💐
======================================
న్యాయాలు -248
వేణ్యాకాశ న్యాయము
*****
వేణి అంటే ప్రవాహము, అనేక ప్రవాహముల యొక్క కూడిక, సర్పాకారముగా అల్లిన జడ,కాలువ అనే అర్థాలు ఉన్నాయి..ఆకాశః అనగా నింగి,అంతరిక్షము, మిన్ను,అంబరము, బయలు, సర్వమంగళము అనే అర్థాలు ఉన్నాయి.
అనేక ప్రవాహములు ఒకే చోట కూడడాన్ని ఇక్కడ త్రివేణి సంగమమమనే అర్థముతోనూ,జ్ఞాన ప్రవాహ సంగమమనే అర్థంతో తీసుకోబడింది.
ఈ త్రివేణి సంగమంలో శుక్ల(తెలుపు), కృష్ణ(నలుపు),లోహిత(ఎఱుపు) వర్ణములు గల గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసి ఆ జలమున కొక చక్కని  ఆకాశంలోని అందమైన వర్ణాల వలె కొత్త రంగు ఏర్పడినట్లు...
ఈ మూడు వర్ణాలు మూడు గుణాలకు ప్రతీకగా త్రిమూర్తుల స్వరూపమైన సచ్చిదానందమయుడుగానూ, జ్యోతిస్స్వరూపుడుగానూ, స్వయం ప్రకాశుడు అయిన విరాట్ పురుషుడుగా వెలుగొందుతున్నాడని ఆధ్యాత్మిక వేత్తల భావన.
అయితే మన పెద్దలు గురువును కూడా త్రిమూర్తి స్వరూపంగా, త్రివేణి సంగమ రూపంగా భావించాలని చెబుతూ ఈ క్రింది శ్లోకాన్ని ఉటంకించారు.
 "గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః/ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః"
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపమైన గురువు మానవ రూపంలో ఉన్న దైవంతో సమానమనీ, సృష్టికర్త అయిన బ్రహ్మ వలెనే గురువు సృష్టి కర్తనీ, విష్ణువు వంటి రక్షకుడే గురువు అనీ,శివుని వలె పరివర్తన కలిగించే శక్తి గురువులో ఉంటుందని చెప్పారు.
గురువు సర్వోన్నతమైన పరమాత్మ. గు అంటే చీకటి నుండి రు అంటే తొలగించుట అని అర్థం.  అజ్ఞానమనే చీకటిని తొలగించి  జీవితానికి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే వ్యక్తే గురువు. అలాంటి గురువును గౌరవించడం మన విధి అని చెప్పారు.
రామ చరిత మానస్ రచించిన భారతీయ భక్తి కవి తులసీ దాస్  గురు శిష్య బంధం గురించి ఇలా చెప్పాడు.
"ధ్యాన మూలం గురుర్ మూర్తీః/పూజా మూలం గురుర్ పదం/ మంత్ర మూలం గురుర్ వాక్యం/ మోక్ష మూలం గురుర్ కృపా/"
ధ్యానానికి మూలం గురువు.తీర్థయాత్రలన్నీ గురువు పాదాల చెంతనే ఉంటాయి.గురువు చెప్పే ప్రతి మాట శిష్యునికి మంత్రం లాంటిది. మోక్షానికి మూలం గురువు యొక్క అనుగ్రహం.గురువు అనుగ్రహం వల్లనే ఈ భౌతిక కోరికల సాగరాన్ని  దాటగలం.ఆరాధనకు మూలం గురువు పాదాలు.మంత్రానికి మూలం గురువు మాట అని పై శ్లోకం అర్థం.
అలాగే కబీర్ దాస్ దోహా చూద్దాం...
"గురు గోబింద్ దోపు ఖడే కాకే లాగూ పాయ్/ బలిహారీ గురు ఆప్ నే గోబింద్ దియో బతాయ్" 
దీని అర్థము ఏమిటంటే గురువూ, భగవంతుడు ఒకేసారి ముందుకొస్తే ముందు ఎవరికి నమస్కరించాలి? భగవంతుణ్ణి చూపించిన వాడు గురువు.అందుకని ముందుగా గురువు కాళ్ళకే నమస్కరించాలి.
ఈ న్యాయమును అత్యున్నతుడైన గురువుకు ఈ న్యాయము  వర్తింప చేయడం విశేషం.

త్రివేణి సంగమమై విద్యార్థుల మనోక్షేత్రంలో  ప్రవహిస్తూ వారి జీవితాలను సింగిడి రంగుల జ్ఞాన ప్రపంచంలోకి  అడుగుపెట్టేలా చేస్తాడనీ, వారిలోని శూన్యాన్ని  విద్య,వివేకం, నైతిక విలువలతో పూరిస్తాడని  చెబుతూ... గురువు యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలిసేలా  చేయడమే ఈ న్యాయము యొక్క అంతరార్థము.
ఈ "వేణ్యాకాశ  న్యాయము" ద్వారా జ్ఞానజ్యోతి స్వరూపమైన గురువు గురించి తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు