సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -282
శుక్త్యంబు బిందు న్యాయము
*****
శుక్తి అంటే ముత్తెపు చిప్ప, శంఖము,నత్తగుల్ల అనే అర్థాలు ఉన్నాయి. అంబు అంటే నీరు. బిందువు అంటే చుక్క, బొట్టు.
ముత్యపు చిప్పలో పడిన వాన బొట్టు ముత్యం అవుతుంది.
సత్పురుషుని యందు గావింపబడిన అనగా సత్పురుషుడు పొందిన జ్ఞానోపదేశము బ్రహ్మ సాధకమై రాణిస్తుంది.
 అంటే మనుషుల వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను బట్టి నేర్చుకున్న విద్య, విజ్ఞానం రాణిస్తుంది అనే అర్థంతో ఈ "శుక్త్యంబు బిందు న్యాయము"చెప్పబడింది. 
అందుకే వేమన గారు ఏమంటారంటే...
 చిప్పబడ్డ నీటి చినుకు ముత్యంబాయె/నీటబడ్డ చినుకు నీట గలిసె/బ్రాప్తి గల్గు చోట ఫలమేల తప్పురా/విశ్వధాభిరామ వినురవేమ "
అంటే ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమవుతుంది.నీటిలో పడిన చినుకు నీటిలోనే కలిసిపోతుంది.మనకంటూ ప్రాప్తం ఉండాలే గాని మనకంటూ రావాల్సి వచ్చే ఫలితం రాకుండా ఉండదు.దానిని ఖచ్చితంగా పొందుతాము.అనగా ఆ ప్రాప్తం అయ్యే దిశగా మన వ్యక్తిత్వం మలచబడి ఉండాలి అంటారు.
ఇదే విషయాన్ని మరో కోణంలో చెప్పిన భర్తృహరి  సుభాషితమును చూద్దాం.
 " నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు నా/ నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా/నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్/ భౌరుష వృత్తు లిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్!"
అంటే నీటి బిందువు కాలుతున్న కాలుతున్న పాత్రపై బడితే కనిపించకుండా వెంటనే ఆవిరై నశిస్తుంది.ఆ నీటి బిందువే తామరాకు మీద పడినప్పుడు ముత్యము వలె కొంత సేపటి వరకు కనిపించి పోతుంది. ఆ నీటి బిందువే ఆల్చిప్పలో పడినట్లయితే నిజమైన శాశ్వతమైన ముత్యమై ప్రకాశిస్తుంది.
కాబట్టి మనిషికి తన యొక్క యోగ్యత, వ్యక్తిత్వాన్ని బట్టి ఈ లోకంలో  మూడు రకాలైన స్థితులను పొందుతాడు.
అయోగ్యుడికి ఎంత చెప్పినా చెప్పింది వినకుండా కాలిన పాత్రపై బడిన నీటిబొట్టులా అంతరించి పోతాడు. 
జ్ఞానమును కొంత వరకైనా వంట పట్టించుకున్న వ్యక్తి  తామరాకు మీద నీటి బొట్టెలా ముత్యంలా కనిపిస్తుందో అలా కొంత కాలమైనా గుర్తింపు పొందుతాడు.
ఇక సద్గుణాలు కలిగిన వ్యక్తి జ్ఞానాన్ని గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తూ పరిపూర్ణమైన జ్ఞానిగా నిజమైన ముత్యంలా సదా ప్రకాశిస్తూ వుంటాడు.
అలా వ్యక్తి అధములతో చేరితే అధముడు గానూ,మధ్యములతో చేరితే సామాన్యుడు గానూ ఉత్తములతో చేరితే ఉత్తముడు గానూ రాణిస్తాడు.
పై విధంగా ఉత్తమమైన ముత్యంలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలనే గొప్ప విషయాన్ని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు