న్యాయాలు -285
శూర్ప న్యాయము
*******
శూర్ప అంటే చేట.
చేట ఏం చేస్తుంది?మట్టి పెడ్డలు, తవుడు,ఊక మొదలగు వాటిని వదిలి వేసి బియ్యాన్ని మాత్రమే తనలో ఉండేవిధంగా చేస్తుంది.
ఈనాటి తరం వారు అంతగా ఉపయోగించడం లేదు కానీ చేట లేని ఇల్లంటూ ఉండేది కాదు. గృహోపకరణాలలో చేటది ప్రత్యేకమైన స్థానం.
ఇప్పటికీ నిన్న మొన్నటి తరం వారికి చేట విలువ బాగా తెలుసు. చేటతో చెరిగినప్పుడు బరువుగా ఉన్నవి వెనక్కి, తేలికగా ఉన్న పొట్టు లాంటివి ముందుకు వచ్చి చెరగగానే కిందికి పడిపోయేవి.ఇక బియ్యంలో సన్న పురుగు,లక్క పురుగు లాంటివి వచ్చినప్పుడు వాటిని తీసేయడానికి రోట్లో వేసి కొద్దిగా దంపి చేటతో చెరిగే వారు.
చేటను మేదరి వృత్తి వారు చేసేవారు. వెదురు బద్దలను వెడల్పుగా చీల్చి వెనుక వైపు కొంచెం ఎత్తుగా అంచులతో ఉండి పట్టుకోవడానికి వీలుగా వుండేలా, రాన్రానూ తగ్గుతూ సాఫీగా చెరగడానికి వీలుగా అల్లుతారు.
వెదురు కాబట్టి సన్నని పుల్లలు లేస్తుంటాయి.అవి గుచ్చుకోకుండా, అలాగే అల్లికలో అక్కడక్కడ ఉండే చిన్న రంధ్రాలను పూడ్చేందుకు కాగితాలు, మెంతులు కలిపి నానబెట్టిన మిశ్రమంతో చేటకు పూత పూస్తారు. అలా చేయడం వల్ల చేట నునుపుగా చూడ్డానికి అందంగా తయారవుతుంది.
చేటను భారతీయుల్లో చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు.వివాహ సందర్భంలో పెళ్ళి కూతురుతో చేటలను వాయనంగా ముత్తైదువులకు ఇప్పిస్తూ వుంటారు.
ఇక శిశువు పుట్టిన తర్వాత పదకొండవ రోజున పురిటి స్నానం చేయించి ఆ శిశువును చేటలో బియ్యం పోసి దానిపై మెత్తని పట్టు వస్త్రాన్ని పరుస్తారు. ఇక ఆ చేటలో శిశువును పడుకోబెట్టి మెడలో ఓ బంగారు హారం వేసి అలా కొద్ది సేపు వుంచుతారు.ఇదో పవిత్ర కార్యంగా చేయడం ఆనవాయితీ.
కొంతమంది మాత్రం శిశువును బియ్యం జల్లించే జల్లెడలో కూడా ఇలాగే పడుకోబెడుతుంటారు.
ఇక వ్యవసాయ పనుల్లో కూడా చేటకు ముఖ్యమైన స్థానమే ఉంది. పంట కోసి వడ్లు నూర్పిడి అయిన తరువాత వాటిలో తాలు, తప్ప పోవడానికి గాలివాటు చూసుకుని బండికానీ మరేదైనా ఎత్తు ప్రదేశం కానీ ఎక్కి వడ్లను నెమ్మదిగా కిందికి జార విడుస్తూ వుంటారు. దాంతో గట్టి వడ్ల గింజలు కింద రాలుతూ, గడ్డిపరకలు తాలు ఓ పక్కకు ఎగిరి పోతాయి. దీనినే "తూర్పారబట్టడం" అంటారు .
ఇలా చేటకు మనకు గట్టి సంబంధమే ఉందన్న మాట.
అయితే ఈ "శూర్ప న్యాయము"ను మన పూర్వీకులు చెప్పడంలో ఉన్న నిగూఢమైన అర్థాన్ని కూడా చూద్దాం.
అరిషడ్వర్గాలనే దుర్గుణాలు ఎప్పుడూ మనిషి మనసును సరిగా ఉండనీయకుండా చేస్తుంటాయి.మానవీయ విలువలను బయటికి రానీయకుండా ప్రయత్నిస్తాయి.
కాబట్టి చేట ఏ విధంగా చెడుకు సంబంధించిన తాలు, తప్ప, రాళ్ళూ రప్పలను చెరిగేస్తుందో మనం కూడా దుర్గుణాలను ఎప్పటికప్పుడు చెరిగేసుకుంటూ ఇతరుల ఆకలి తీర్చేందుకు ఉపయోగ పడే బియ్యంలా తయారవ్వాలి.
అందుకే ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారన్న మాట.
ఇక చేటకు సంబంధించిన ఆసక్తికరమైన జాతీయాల్లో "తూర్పార బట్టడం, చేట భారతం" ముఖ్యమైనవి.
ఫలానా వ్యక్తుల పనులను తూర్పారబట్టారు అంటుంటారు.అంటే వాళ్ళలో పొల్లు, పొట్టు,తాలు లాంటి లక్షణాలు ఎన్నున్నవో వెలికి తీసి చెప్పడమన్న మాట.
ఇక "చేట భారతం" అనే జాతీయం గురించి ధర్మ సందేహాల్లో అడిగిన ప్రశ్నకు కొందరు పండితులు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. చేట మొదట్లో చిన్నగా అంచులతో ఉండి రాన్రానూ వెడల్పు అవుతుంది. అంటే విస్తరిస్తుంది కదా అలాగే భారతాన్ని కూడా అలా పద్దెనిమిది పర్వాల దాకా విస్తరింప జేసారు.అందుకే భారతాన్ని "చేట భారతం" అంటారని చెప్పారు.
అయితే భారతం అంతా వింటే మనకు చివర్లో అర్థం అయ్యేది ఏమిటంటే మనలోని చెడును తొలగించుకోకపోతే, చెరగక పోతే చివరికి కౌరవుల్లా ఐపోతాము అని.
మరో సంగతి ఏమిటంటే ఎవరైనా ఏదైనా విషయాన్ని సాగదీసి చెప్పినప్పుడు కానీ , రాసినప్పుడు కానీ "అబ్బో! చేట భారతంలా ఉంది" అనే జాతీయాన్ని ఉపయోగించడం చూస్తుంటాం.
ఇక చేట పదాన్ని ఎంత సరదాగా నవ్వుకునేలా చేశాడో ప్రముఖ హాస్యనటుడు అలీ ఓ సినిమాలో ఓ సినిమాలో వాడింది గుర్తొస్తుంది ఎవరికైనా .ఏవేవో అర్థం,పర్థం కాకుండా మాట్లాడి చివర్లో"'ఎన్నా చేట"అనడం తలచుకుంటే భలే నవ్వు తెప్పిస్తుంది.
ఇవండీ! చేట యొక్క విశేషాలు, విశేషణాలు. మరి మనం కూడా మనలోని చిన్నా చితకా దురాలోచనలు, దుర్గుణాలు వుంటే చెరిగేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి