సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -295
శ్వ పుచ్ఛ న్యాయము
     ******
శ్వ అనగా కుక్క.పుచ్ఛము అనగా తోక.
కుక్క తోకను సరిచేయ ప్రయత్నించినట్లు.
అంటే "కుక్క తోక వంకర"  దానిని సరి చేయడం కష్టమని మనందరికీ తెలిసిందే, అలాంటి వంకర బుద్ధి ఉన్న వ్యక్తిని కూడా బాగుచేయడం, సరియైన దారిలోకి తీసుకుని రావడం చాలా కష్టమనే అర్థంతో ఈ" శ్వ పుచ్ఛ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే మన తెలుగు వాళ్ళు "కుక్క తోకకు గుండ్రాయి కడితే సక్కగా అవుతుందా? కుక్క తోక లాంటి బుద్ధి గల వాడిని ప్రయత్న పూర్వకంగా ఎంత సరిచేసినా మళ్ళీ మొదటికే వస్తాడు తప్ప బాగుపడడు." అనే అర్థంతో ఈ న్యాయమును ఉపయోగించి మరీ తిడుతుంటారు.
 నిజమేగా  కుక్క తోక వంకరకు లేదా వక్రతకు చిహ్నం. అలాగే కుక్క బుద్ధి కూడా.
కుక్క ఎవరింట్లోనైనా దొంగతనంగా అన్నం కూరలను ముట్టినప్పుడు ఇంటి యజమాని లేదా ఆ ఇంటి వాళ్ళతో దెబ్బలు తింటుంది.అలా తినేటప్పుడు 'ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను ' అని గట్టిగా మనసులో అనుకుంటూ వుంటుందట.కానీ ఆ గడప లేదా ప్రాంగణం దాటగానే చెవులు గట్టిగా జాడిస్తుందట. ఇంకేముంది అప్పటి వరకు తప్పును సరిదిద్దుకుందామనుకున్నది మరిచి పోతుంది. యథావిధిగా మళ్ళీ అలాంటి పనులు చేస్తూ తిట్లూ, దెబ్బలు తింటూనే వుంటుందన్న మాట.
 మారని కుక్క బుద్ధి గురించి సుమతి శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా..!
"కనకపు సింహాసనమున/శునకమును గూర్చుండ బెట్టి శుభ లగ్నమున/దొనరుగ పట్టము గట్టిన/ వెనుకటి గుణమేల మాను? వినురా సుమతీ!"
కుక్కను బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి ముహూర్తంలో పట్టాభిషేకం చేసినా దాని సహజమైన అల్పబుద్ధి మానదు.అలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా,ఆ వ్యక్తి తనలోని నీచ గుణాలను ఒక పట్టాన వదిలించుకోడని అర్థం.
 
అలాగే  వక్రబుద్ధి  గల వ్యక్తికి అధికారం వస్తే లేదా ఇస్తే ఎలా వుంటాడో అలాంటి వ్యక్తుల  బుద్ధిని కాచి వడపోసిన వేమన అలాంటి వ్యక్తిని  ఘాటుగా  తిడుతూ  రాసిన  పద్యాన్ని చూద్దాం.
"అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన/ దొడ్డవారి నెల్ల తొలగగొట్టు/చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా?/ విశ్వధాభిరామ వినురవేమ!"
కుక్క చెరకు లాంటి మంచి పదార్థాలను తినకుండా  చెప్పులాంటి  వ్యర్థ పదార్థాలను తింటుంది.అంటే మంచిని ఇష్టపడదు.అలాగే వక్రబుద్ధి, అల్పబుద్ధి గల వ్యక్తికి అధికారం ఇచ్చినట్లయితే తాను మంచి పనులు  చేయడు, చేయడానికి ఇష్టపడడు. పైగా అలా చేసేవాళ్ళను  చాలా యిబ్బందులు పెడతుంటాడని అర్థము.
"శ్వ పుచ్ఛ న్యాయము" వలె అలాంటి వారిని బాగుపరచడం, మార్చడం బ్రహ్మ దేవుడి వల్ల కూడా  కాదు అంటుంటారు మన పెద్దలు.
కాబట్టి అలాంటి వారిని మార్చాలనే తలంపులు ఏమైనా వుంటే తక్షణమే విరమించుకుందాం. నాతో ఏకీభవిస్తారు కదూ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు