సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
న్యాయాలు -284
శుష్క తటాక మత్స్య న్యాయము
******
శుష్క అనగా ఎండినది.తటాకము అంటే చెఱువు.మత్స్య అనగా చేపలు.
ఎండి చెఱువు లోని చేపల వలె...
చేపల మనుగడ నీళ్ళలోనే సాధ్యం అవుతుంది.మరి ఆ నీళ్ళే లేకుండా ఎండిపోయిన చెరువులో చేపలు బతకగలవా? వాటి జీవనాన్ని కొనసాగించగలవా? అంటే ఖచ్చితంగా బతకలేవు,మనుగడ కష్టమనే సమాధానం వస్తుంది.

సందర్భం వచ్చింది కాబట్టి  చేపల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

చేపలు లేదా మత్స్యాలు నీటిలో నివసించే ఒక రకమైన జంతువులు.ఇవి సకశేరుకాలు.చేపలు గుడ్డుగా జీవితం ప్రారంభించినప్పటి నుండి వాటి జీవితాంతం వరకు నీటిలోనే నివసిస్తాయి.ఇవి తమ మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతాయి.

మానవుల శరీరాలు చెమటతో తడిచినప్పుడు తప్ప  ఎల్లప్పుడూ పొడి పొడిగానే వుంటాయి.కానీ చేపలు మాత్రం నీటిలో ఉన్నా బయటున్నా తడి తడిగానే ఉంటాయి.

చేపలలో  జాతులను బట్టి  నీటి బయట జీవితం ఉంటుంది.నీళ్ళ లోంచి బయటకు వచ్చిన తరువాత కొన్ని జాతుల చేపలు పది నిమిషాల వరకు మాత్రమే జీవించగలవు.మరికొన్ని మాత్రం రెండు నెలల వరకు కూడా జీవించగలవు. 

ఇలా నీటి నుండి బయటకు వచ్చిన చేపలు బతకక పోవడానికి కారణం అవి నేరుగా గాలి నుండి ఆక్సిజన్ ను పీల్చుకోలేవు.అందువల్ల అవి ఊపిరాడక మరణిస్తాయని మనకు తెలిసిందే కదా!.

మరి "శుష్క తటాక మత్స్య న్యాయము" గురించి  చెప్పుకోవడం అంత అవసరమా? అనే ఆలోచన మనందరిలో ఈ పాటికి వచ్చే వుంటుంది. 

కానీ నిశితంగా ఆలోచిస్తే...
ఇందులోని  అంతరార్థం పెద్ద వాళ్ళ ఆంతర్యం అర్థం అవుతాయి.

మనమూ చేపల్లాంటి వారమేననీ.అనుకూలమైన పరిస్థితుల్లోనే మన మనుగడ సాధ్యమవుతుందనీ. అలాంటి పరిస్థితులు కరువైనప్పుడు  మనిషి జీవితం నరక ప్రాయమవుతుందని  పెద్దలు అనుభవించి  మరీ చెప్పడం జరిగింది.

చేపల గురించి ఆలోచిస్తే.. చేపల ప్రపంచం నీళ్ళే.ఆ ప్రపంచంలో చేపలు ఆనందంగా ఈదుతూ, గంతులు వేస్తూ జీవిస్తాయి. మరి మనిషి బతకడానికి నీళ్ళ లాంటి ఆహ్లాదకరమైన, ఆనందంగా జీవించే ప్రపంచం కావాలి.ప్రకృతి సహజంగా దొరికేవే కాదు మనసుకు సంబంధించిన  ప్రేమ,అనురాగం, ఆత్మీయత, అభిమానం, ఆదరణలు కూడా కావాలి. అవి దొరకని పక్షంలో మనుషులుగా బతికినా జీవశ్చవాలేననీ,ఆ ఉద్దేశంతోనే ఈ "శుష్క తటాక మత్స్య న్యాయాన్ని  చెప్పడం జరిగింది.

 మన చుట్టూ ఉన్న సమాజంలో నిరాదరణకు గురైన కొందరు అనాధలు, వృద్ధులను చూసినప్పుడు ఈ న్యాయము గుర్తురాక మానదు.

కాబట్టి అలాంటి జీవితాలను గడిపే వారికి మన వంతుగా చేపలకు నీళ్ళలా ఆత్మీయత అనురాగాల్ని పంచి మనలోని మానవతా హృదయాన్ని చాటుకుందాం.

ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు