సుప్రభాత కవిత ; - బృంద
నీటి అంచున నిదురలేచి
నింగిలోని చుక్కలవలె
కంటికింపుగా విరిసి వేచిన
కుసుమ సిరిబాలల నిరీక్షణ

చూచి ముచ్చటగ సోయగాలు
మురిసిపోయి ముద్దులూరి
తాకి రమ్మని గాలితో 
కబురుపంపిన సాగే ఏరు

దూరంగా కొండల నడుమ
గారంగా తొంగి చూసే
పసిడి రేఖల మెరుపు చూసి
మిడిసిపడ్డ పుష్ప సోయగం

కలలు కన్న కమ్మని రూపం
కనులముందు కదిలివస్తే
కనుల చెలమలు నిండిపోగా
కళలు విరిసిన సుమ సందోహం

ఊయలూగే మనసులాగే
ఊపుతున్న గాలికి తాను
ఊపిరిలా పరిమళాన్ని
ఊదుతున్న విరులసరులు

పూల వెనక దాగిన
కొంటెనవ్వులేమనెనో
ఏటి జోరు దేనికొరకు
కాస్త ఆగెనో ఎవరికెరుక?

వినగలిగే మనసుంటే
ప్రకృతే ఒక ప్రణయగీతం
అనగలిగే పదాలు దొరికితే
అణువణువూ ప్రణయ కవనమే

కమ్మని అందాలతో 
కనువిందుచేసే
అపురూపమైన 
అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు