న్యాయాలు -312
సదృశా త్సదృశోద్భవఃన్యాయము
****
సదృశము అంటే సమానము,తగినది. సదృశోద్భవ అంటే సమానమైన సృష్టి లేదా పుట్టుక.
ఈ న్యాయము చూడడానికి, చదవడానికి పెద్దదిగా అనిపిస్తుంది కానీ దీని అర్థము ఒక్క మాటలో చెప్పాలంటే ."ఎటువంటి దాని నుండి అటువంటివే పుడుతుంది"అని.
ఉదాహరణకు మామిడి చెట్టు నుండి మామిడి కాయలు పుడతాయి. వేపచెట్టు నుండి వేప కాయలే పుడతాయి. అనగా ఏ విత్తనము వేస్తే ఆ చెట్టే, ఆ విత్తనాలనే మళ్ళీ పొందగలం.అవే వస్తాయి అనే అర్థంతో ఈ "సదృశా త్సదృశోద్భవఃన్యాయము" చెప్పబడింది.
అందుకే మన వాళ్ళు " విత్తొకటి వేస్తే చెట్టొకటి మొలుస్తుందా?"అంటుంటారు.
అది కేవలము చెట్టుకో పశుపక్ష్యాదులకో కాదు మానవులమైన మనకూ,మన మనసులకు కూడా వర్తిస్తుంది.
అంటే మన భౌతిక లక్షణాలు కానీ మానసిక లక్షణాలు కానీ ఒక తరం నుండి మరో తరానికి సంక్రమిస్తాయన్న మాట.అంటే తల్లిదండ్రుల నుంచి వారి లక్షణాలు సంతానానికి అనువంశికత లేదా పారంపర్యంగా అందుతాయని అర్థం.
జన్యు శాస్త్ర పితామహుడిగా పేరొందిన గ్రెగర్ మెండెల్ తో పాటు మరికొందరు అనువంశిక వాదులు వారసత్వంగా వచ్చే లక్షణాలను గుర్తించి చెబితే జె.బి వాట్సన్ లాంటి పరిసర వాదులు వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
కానీ ఇక్కడ వంశ పారంపర్యమా, పరిసరాల ప్రభావమా! అనే విషయం పక్కన పెట్టి ,అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఎవరి మనసు, ఆలోచనలు వారి స్వంతమే కదా!ఆ మనసు అనే క్షేత్రంలో ఎలాంటి ఆలోచనా విత్తనం వేస్తున్నామా మరియు మన తర్వాత తరానికి ఎలాంటివి అందజేస్తున్నామా అనేది ముఖ్యం.
మన పెద్దలు నేర్పిన,మనంత మనంగా నేర్చుకున్న మానవీయ విలువలు మన తర్వాత తరానికి మన ద్వారా ఈ విలువలు అందాలి.
విలువల వటవృక్షాల్లాంటి మన ద్వారా తర్వాత తరానికి అందేలా చూడాల్సిన బాధ్యత కుటుంబంలోనే కాకుండా సమాజపరంగా కూడా మనపై ఉన్నదని గ్రహించాలి.
ఈ విషయాలపై దృష్టి పెట్టి సమాజాన్ని గమనించినట్లైతే ఇవి చాలా వరకు నిజమని తేలుతుంది.
ఓ మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారిలో, అభద్రతా భావంతో కూడిన కుటుంబం నుంచి వచ్చిన వారిలో, హింసాత్మక ప్రవృత్తి గల కుటుంబం నుంచి వచ్చిన వారిలో గల విలువలు,లక్షణాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే.
అందుకే మనసు మంచిదైతే మనిషి మంచి వ్యక్తి అవుతాడు. వ్యక్తులు మంచివారైతే ఆ వ్యక్తులు ఉన్న సమాజం మంచిది అవుతుంది.
అంటే మంచి నుండి మంచే పుడుతుంది అనే అర్థంతో ఈ "సదృశా త్సదృశోద్భవఃన్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాతో ఏకీభవిస్తారుగా...
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి