న్యాయాలు -328
సింహావలోకన న్యాయము
*******
సింహము అనగానే అడవికి రారాజైన మృగరాజు మృగపతి కేసరి సారంగం సింగము అనే పదాలు చటుక్కున గుర్తుకు వస్తాయి.అవలోకనం అనగా చూచుట, దృష్టి , చూపు అనే అర్థాలు ఉన్నాయి.
సింహము అంటే సింహము.అవలోకనము అంటే చూడటం,వీక్షించడం. సింహావలోకనము అంటే సింహం యొక్క చూపు.
మనుషులు చూసినట్టే సింహమూ చూస్తుంది.అందులో గొప్పతనమేముంది? అనుకుంటూ వుంటాం కదా! ఈ పాటికి.
కానీ మన పెద్దవాళ్ళైన పూర్వీకుల చూపు మామూలుది కాదండోయ్! సింహం చూపులోని ప్రత్యేకతను గుర్తించి సింహావలోకనం అని పేరు పెట్టారు.
మరి సింహావలోకనము అంటే ఏమిటో చూద్దాం.సింహం నడుస్తూ నడుస్తూ కొంత దూరం వెళ్ళాక నడిచి వచ్చిన దూరాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటుందట . అలా వెనక్కి తిరిగి చూసుకోవడాన్నే సింహావలోకనము అంటారన్న మాట.
మరి ఎందుకలా చూసుకుంటుందో తెలుసుకుందాం.సింహాలు అడవుల్లో వుంటాయి.మనం ఇళ్ళల్లో నివసిస్తున్నట్లు అవి గుహల్లో నివసిస్తాయి.అవి అడవిలో దర్జాగా తిరుగుతూ ఇష్టమైన జంతువుని వేటాడి కడుపునిండా తిన్న తరువాత తిరిగి గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాయి.
అలా సింహాలు వేటకోసం బయటికి వచ్చి కొంత దూరం నడిచాక వెనక్కి తిరిగి గుహనో తాను నడిచిన దూరాన్నో చూసుకుని గట్టిగా గర్జిస్తాయట.తమ గుహలోకి ఎవరూ పోవద్థనే హెచ్చరిక కావచ్చు.
లేదా ఓ జంతువును వేటాడి తిన్న తరువాత కొంత దూరం వెళ్ళాక వెనుతిరిగి ఆ ప్రదేశంలో మరే జంతువు వుందా? అనే ఆలోచనైనా కావచ్చు లేదా తాను చేసిన పనిని, వచ్చిన దూరాన్ని నెమరేసుకునేందుకు కావచ్చు.ఆ విధంగా సింహం గతాన్ని నెమరేస్తూ, వర్తమానంలో అప్రమత్తంగా వుంటూ జీవిస్తుందన్న మాట.అదే సింహం యొక్క ప్రత్యేకత.
సింహావలోకనం అంటే మనకిప్పుడు తెలిసిపోయింది .మరి దీనిని ఓ న్యాయముగా చెప్పడంలో అంతరార్థం ఏమిటో చూద్దాం.
వ్యక్తులు కూడా తాము చేసిన పనులను, గడిచి పోయిన కాలాన్ని నెమరేసుకుంటూ వుంటారు.తలపెట్టిన కార్యం లోని లోటుపాట్లు కావచ్చు, సాధించిన విజయాలు కావొచ్చు, ఇంకా చేయాల్సిన వాటి గురించి కావొచ్చు... వీటన్నింటినీ పునరాలోచన చేసుకోవడం , వర్తమానంలో బతకడమే సింహావలోకనమని అర్థం చేసుకోవచ్చు.
సింహం ఓ కౄర మృగం. దాని ఆహారం జంతువులు. కాబట్టి అది జంతువులను నిర్ధాక్షిణ్యంగా వేటాడి తింటుంది. తన జోలికి ఇంకా ఎవరైనా వస్తున్నారా?కనుచూపు మేరలో ఎవరైనా ఉన్నారా? అని వెనక్కి తిరిగి చూడటం దాని సహజ గుణం.
మరి మనం సింహావలోకనం ఎందుకు చేయాలి ? అందరమలా చేస్తున్నామా? స్వామి వివేకానంద గారి మాటల్లో చూద్దాం...
చాలా మంది వర్తమానాన్ని వదిలేసి గతాన్ని తలుచుకుంటూ ఆందోళన, మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు.గతించిన వాటిల్లో వేదనా భరిత విషయాలనే నెమరేస్తూ వుంటారు. కానీ సింహావలోకనం అంటే అది కాదు కదా! మనం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ, పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండి , భవిష్యత్తుపై నమ్మకంతో వర్తమానాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి.
కేవలం చేయాల్సిన పనుల విషయంలోనే కాకుండా తెలిసో తెలియకో మాటల ద్వారా,చేతల ద్వారా ఎవరినైనా యిబ్బంది పెట్టామా? గాయ పరిచామా? అనేది కూడా మనసున్న మనుషులుగా మనం చేయాల్సిన పునరాలోచన.తద్వారా మన ప్రవర్తనలో మంచి మార్పు వచ్చేలా చూసుకోవడమే వివేకానంద స్వామి గారు చెప్పిన సింహావలోకనంలోని అంతరార్థం.
అదండీ! "సింహావలోకన న్యాయం" అంటే. మనమే కాకుండా మన తోటి వారిని కూడా కార్యోన్ముఖులను చేసేందుకు, వర్తమానంలో జీవించి మంచి ఫలితాలను పొందేందుకు పై విధంగా ఆలోచింపజేయించి,వారిలో మంచి మార్పు వచ్చేలా మన వంతు ప్రయత్నం చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి