రాజాం వరలక్ష్మి సెంటాన్స్ స్కూల్ లో గత పాతికేళ్లుగా డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తున్న వంజరాపు శంకరరావు అనారోగ్య కారణంగా మృతి చెందారు. రాజాంలో నివాసం ఉంటున్న శంకరరావు స్వగ్రామం కొత్తపల్లి కాగా, కొత్తపల్లిలో అంత్యక్రియలు జరిగాయి.
ఈయనకు గృహిణి అయిన భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బి.ఎస్సీ పూర్తిచేసిన పెద్దకుమార్తె హరిప్రియకు రెండేళ్ల క్రితం పెండ్లి చేసీ తండ్రిగా తన బాధ్యత పోషించారు శంకరరావు.
అవివాహిత అయిన రెండవ కుమార్తె జోత్స్న, బిటెక్ పూర్తిచేసుకొని ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు.
ఈమె యొక్క వివాహంచేసి ఈ బాధ్యతను కూడా నెరవేర్చుకోవాలనుకుంటున్న దశలో అనారోగ్యం బారినపడి మృత్యువాత పడడంతో బంధుమిత్రులంతా ఎంతగానో విలపిస్తున్నారు.
శంకరరావు చిత్రకారుడుగా వేలాదిమంది విద్యార్థులకు తన నేర్పుతో గొప్ప చిత్రకారులుగా తీర్చిదిద్దారు.
తొలుత శంకరరావు పార్వతీపురంలో స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ షాప్ ను నెలకొల్పి తానే స్వయంగా పెళ్లికార్డులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, సినిమా హాల్లో స్లైడ్ లు, బ్యానర్లు, పెళ్లి కలశం, తోరణాలు, స్వాగతం పలికే బోర్డులను గొప్ప సృజనాత్మకంగా రూపొందించి అనేక బహుమతులు, సత్కారాలు పొందారు.
1993లో విజయనగరం జిల్లా సాక్షరతా సమితి వారి అక్షర విజయం లోగో పోటీలలో శంకరరావు రూపొందించిన లోగోయే ఎంపికై అక్షర విజయం చిహ్నాన్ని లిఖించిన రూపకర్తగా విజయనగరం జిల్లా చరిత్రలో నిలిచారు.
రాజాంలో వెలుగు సంస్థ ఏడాదిపాటు నిర్వహించిన మూడు యాభైల గురజాడ కార్యక్రమ సభలో ఆవిష్కరించిన పుస్తకం ముఖచిత్రంపై గురజాడ అప్పారావు గారి పటం శంకరరావు చేతులనుండి జాలువారిన కళాఖండమే.
ప్రపంచం అందరికీ గురజాడ చరిత్ర విస్తృతపరచాలన్న ఈ ఆంగ్లమాధ్యమ గురజాడ పుస్తకానికి శంకరరావు ముఖచిత్రకారుడై ప్రపంచ ఖ్యాతిని పొందారు.
శంకరరావు ఒకవైపు సెంటాన్స్ స్కూల్లో డ్రాయింగ్ టీచరుగా పనిచేస్తూనే, సాయంత్రం వేళల్లో బాలభవన్ చిన్నారులకు కూడా చిత్రలేఖనం అలవాడేలా తర్ఫీదునిచ్చి, మానవతామూర్తిగా ఎంతోమంది అభిమాని ఐనారు. అంతేకాకుండా సెంటెన్స్ స్కూల్ నుండి, బాలభవన్ నుండి హైదరాబాద్, ఢిల్లీ, తెనాలి, విజయవాడ తదితర ప్రాంతాల్లో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు పోటీలకు శంకరరావు చేదోడు వాదోడుగా నిలిచి అనేకమంది బాలబాలికలకు బహుమతులు లభించేలా ప్రోత్సహించారు. రాజాం, రాజాం పరిసర ప్రాంతాలలో అనేక చోట్ల బొమ్మలు వేసి, అందరికీ ప్రీతిపాత్రుడైనారు. పార్వతీపురంలో ఐ.టి.డి.ఏ., సంస్కరణ, సాహితీలహరి, జట్టు, సూర్యపీఠం మొదలగు అనేక సంస్థల సంపుటాలలో, సంకలనాలలో వసరమగఉ భావచిత్రాలు, బ్యానర్లు, అభినందన పత్రాలు రూపొందించి ఎన్నో సత్కారాలు, పురస్కారాలు పొందారు, వంజరాపు శంకరరావు చిత్రలేఖన కళాకారుడుగా మాత్రమే కాకుండా మంచి బోధకుడు కూడా. ఆయన గత పాతికేళ్లుగా వరలక్ష్మి సెంటెన్స్ స్కూల్లో ప్రాథమిక తరగతులకు తెలుగు, ఆంగ్లము, గణితము, పరిసరాల విజ్ఞానాలను బోధిస్తూ ఆదర్శ ఉపాధ్యాయునిగా నిలిచారు. ప్రతి కార్యక్రమానికి వందలాది ప్రాజెక్టు వర్క్స్, వందలాది నమూనా చిత్రాలు, మట్టితోనూ వెదురు పుల్లలతోనూ, గాలి బెలూన్లతోనూ, దూదితోనూ, మొదలగు వస్తువులతో వందలాది మోడల్స్ ను రూపొందించి విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు పొందారు శంకరరావుతో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో నిరాడంబరంగా, నిగర్విగా, మిక్కిలి స్నేహభావంతో మెలిగి అందరి అభిమాన పాత్రుడిగా నిలిచారు. కేవలం 55 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బంధుమిత్రులంతా తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు శంకరరావు మృతి రాజాం పార్వతీపురం ప్రాంతాలకు తీరని లోటని శంకరరావు సుపరిచితులంతా వ్యాఖ్యానిస్తూ నివాళులర్పిస్తున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి