నాన్న;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 తన ఆశలను అటకపైకెక్కించి 
తన ఆశయాలకు నీళ్ళొదులుకుని
తన కోరికలను ఉట్టిపై అట్టిపెట్టి 
తన కలల్ని పాతరేసి
తన వంశాంకురాన్ని పెంచి పెద్దజేసి
వాడి పాదాలకు తన అరచేతుల పాదరక్షై 
వాడి ఆనందాన్ని తన కళ్ళళ్ళో నింపుకుని 
సంతోషపు అలలమీద ఊయలలూగుతాడు 
తన ఒడినే బడిగా మార్చి
తన భుజాలే సింహాసనం చేసి
సంతోషపు చెమటచుక్కై రాలి
పురివిప్పిన నెమలిలా ఆడుతాడు
తాను చీకటిలో నడిచినా
తన వాడికి వెలుగు చూపే దివిటీ అయి
తాను చిరిగిన చొక్కా అయినా
తన వాడి కలంలో సిరాచుక్కై
తన ఉగాదులు ఉషస్సులను
తన వాడికి ధారవోసి 
మౌనంగా ఉబ్బి తబ్బుబ్బవుతాడు  
తనకు తాను సంతోషంగా 
తనవాడికి పెన్నిధై
తానే తనవాడికి పూర్తికాలపు రక్షణ కవచమై
తుదిశ్వాసవరకు
తన శ్వాస తనవాడే అనుకుంటూ
మంటిలో కలిసిపోతూ
మింటిలో చుక్కై నిలబడి మురిసిపోతూ 
తన వాడిని అపురూపంగా చూసుకుంటాడు
తన వాడి విజయాలను
ఆకాంక్షిస్తూనే ఉంటాడు!!
*********************************

కామెంట్‌లు