సుప్రభాత కవిత ;- బృంద
గెలుపుకి తలుపులు తీస్తూ
తూరుపు ఎరుపుగ మారింది
నిన్నటి కలతలు కడిగేస్తూ
మార్పును మనకై తెచ్చేందుకు

సమస్యల వలయం ఛేదిస్తూ
వెలుగుల బాణాలేసేస్తూ
విజయం వైపు మనల్ని
అడుగులు వేసేలా చేసేందుకు

చీకటి లాగానే ఓటమికీ
కనుమరుగవడం తప్పదనీ
వేకువ వస్తే వెతలన్నీ
కంచికి చేరే కథలే అని చెప్పేందుకు....

జీవితమనే కాగితంలో
ఆనందమనే అక్షరాలతో
చిన్ని చిన్ని సంతోషాలు
కన్నుగప్పక నింపుకోవాలి

చిన్నిపాపల చింతలులేని
నవ్వులు
తెల్లారే కళకళగా
విరిసిన పువ్వులు

ఆకులతో గాలి చెప్పే
ఊసుల గలగలలూ
తొలిపొద్దున నులివెచ్చగ తాకే
కిరణాల మిలమిలలూ

ముంగిట మెరిసే ముగ్గులూ
పెరట్లో విరిసిన మల్లె మొగ్గలూ
హాయిగా నవ్వే మిత్రులూ
వేయిగా దొరికే సంతోషాలు

ఇలాటివెన్నో.. తుమ్మెదలు
మకరందం సేకరించినట్థు
ఒకటొకటిగా పోగేసుకుంటూ
సాగిపోవడమే జీవితం

గమనమే జీవన గమ్యమై
మెలికలూ మలుపులతో నిండిన
బ్రతుకుదారిలో వ

చ్చే
మరో ఉషస్సును స్వాగతిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు