;నేటి నిజం- వెంకట రమణారావు వైజాగ్
 ఎన్ని సార్లు చెప్పాను నీకు మావిషయాలు నీకు అనవసరం అని. మేము పెద్దవాళ్ళమే మాకు అన్నీ తెలుసు ,నువ్వు నాన్న మాకేం చెప్పక్కర్లేదు. మీ సంగతి మీరు చూసుకోండి. నువ్వు నాన్న మీ గది లో పడి ఉండండి. ఇంట్లో పనులు అన్నీ చెయ్యండి.అంతకు మించి మీ గీత మీరు దాటకండి. విసురుగా వెళ్ళిపోయింది మా అమ్మాయి.
అసలు మా తప్పు ఏంటో తెలియక అయోమయం లో పడ్డాను. పిల్లలు ఎప్పటికీ తల్లి తండ్రులకి పసి వాళ్ళుగానే  కనిపిస్తారు. అందుకే కొంచం బాగోగులు చెప్పాలి అనిపిస్తుంది. ఇంటెడు చాకిరీ చేస్తున్నా మన పిల్లలే కదా అని ఆనందం గా ప్రేమతో చేస్తున్నాము.
ఏమిటో ఈ పిల్లలతో ఏం మాట్లాడినా తప్పే. 
అత్తగారు వంట అయిందా తొందరగా వడ్డించండి , మీటింగ్ ఉంది అంటూ అల్లుడు పురమాయింపు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నానం చేయించి డిన్నర్ పెట్టేయండి. అన్నట్టు మావగారికి చెప్పండి స్కూల్ కి వెళ్లి పిల్లలని తీసుకు రావాలని అంటూ గుక్క తిప్పుకోకుండా చేప్పేస్తున్నాడు. 
ఇంకా అరగంట పడుతుంది బాబూ వంట అవడానికి అంటూ మెల్లిగా చెప్పాను. కస్సుమని లేచాడు అబ్బాయి.మీకు ఇంకా ఏం పనులున్నాయి ,ఈ మాత్రం కూడా చేయకపోతే మాకు వెస్టు మీరు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. లోపల అమ్మాయితో ఏదో గట్టిగా చెప్తున్నాడు. 
ఈ లోపల అమ్మాయి కోపం తో వచ్చింది , ఎన్ని సార్లు చెప్పాను అమ్మా వంట తొందర గా చెయ్యాలి అని. ఇదేమన్నా ఇండియా అనుకున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు చెయ్యడానికి. టైమ్ అంటే టైమ్ అంతే. 
కొంచం వొంట్లో నలత గా ఉంటే కాసేపు మంచం మీద వాలాను, ఇదిగో అరగంట లో అయిపోతుంది అంటూ హడావిడిగా పరిగెత్తాను.
ఎక్కడ తప్పు జరిగింది తెలీడం లేదు. కని పెంచి ,చదివించి ,పెళ్ళిళ్ళు చేసి జీవితం లో స్తిరపరిస్తే ఇదా మనకు లభించే విలువ.
బాధ పడకు , కూరలు నేను తరిగి ఇస్తా , నువ్వు బియ్యం పెట్టు. ఎక్కువ ఆలోచించకు. 
ఎలాగైనా మీరు రావాలి , మాకు చాలా అవసరం అంటూ కాల్లా వెళ్ళ పడి టికెట్స్ కూడా వాళ్ళే తీసేసి మనని ఇక్కడికి తీసుకు వచ్చి పడేశారు.
వేరే మార్గం లేదు అన్నీ భరించాలి. మన దేశం కూడా కాదు ఎక్కడికీ పారిపోలేము.అంటూ నెమ్మది గా అనునయించారు భుజం మీద చెయ్యివేసి.


కామెంట్‌లు