మధ్యరంగం- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నేను 
నా పసితనం నుండి చూస్తూనే ఉన్నా 
నాలుగు రోడ్ల కూడలిలో 
దర్జాగా తలెత్తుకుని నిలబడి ఉండడం 
ఆరు ఆమడల దూరం దాకా 
ఈ క్లాక్టవర్
గర్వంగా చూస్తూనే ఉంటుంది 
ఈ మధ్యరంగం నిర్మాణానికి 
రాళ్ళెత్తిన కూలీలెవరో 
నాకైతే తెలియదు కానీ...,
వారిని నిత్యం ప్రజానీకమంతా 
స్మరిస్తూనే ఉంటుంది
సర్వకాల సర్వావస్థల్లోనూ
నిట్టనిలువుగా నిలచుని ఉండే క్లాక్ టవర్ 
ఎంతమందికి స్ఫూర్తి నిచ్చిందో 
నాకు తెలుసు 
కుల మత వర్గ వర్ణ లింగ 
తారతమ్యాలు లేని
సమసమాజం కోసం 
అందరినీ అక్కున చేర్చుకుంటుంది 
అందరినీ ఏకం చేస్తుంది 
పొద్దున లేచింది మొదలు 
వణిక్ ప్రముఖులు, ఉద్యోగులు, వ్యాపారులు, 
కార్మికులు, కర్షకులు కూలీలు, శ్రామికులు
ఒక్కరు కాదు అందరూ
ఒక్క జోగిపేట వాసులేకాదు
ఈ వూరొచ్చిన ప్రతిఒక్కరూ
క్లాక్ టవర్ నిర్మాణానికి సలాంచేసినవారే
దాని నుండి ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ పొందినవారే
ఎందరో కవులకు కవిత్వాన్ని
ఎందరో మేధావులకు ఆలోచనలను 
ఎందరో సైనికులకు ధైర్యాన్ని
ఎందరో జనులకు దేశభక్తిని 
అలవోకగా అందించింది 
దాని నీడలో నడయాడిన ప్రతిసారీ
స్వతంత్ర భారత కేతనఛాయలో
నడిచిన అనుభూతి
దాని సరసన కదిలిన ప్రతిసారీ 
గాంధీగారి అహింసా వ్రతవిధాన 
శ్రవణ అనుభూతి 
దాని ఆకారం చూసిన ప్రతిసారీ 
భారత భారతీ ముఖదర్శన అనుభూతి 
దాని గడియారము చూసిన ప్రతిసారీ 
కాలగమనపు మధురానుభూతి 
ఇది జోగిపేట గ్రామ కలికితురాయి 
భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో 
కాలాతీతంగా నిలిచి ఉండే 
స్ఫూర్తి మందిరం 
వెరసి “క్లాక్ టవర్” అని 
ముద్దుగా పిలుచుకునే 
మా వూరి “మధ్యరంగం"!!
*********************************

కామెంట్‌లు