సుప్రభాత కవిత ; -బృంద
రంగులకలలను రమ్మనేలా
నింగిలో విరిసే వెలుగుపువ్వు
ముంగిటిలో కాంతులు కురవ
బంగరు వెలుగులు భువిని నిండె


కొమ్మపై దిగిన కోటి తారలవలె
రెమ్మకొక పువ్వు రేకులు విరిసె
రారమ్మని కిరణాలను పిలిచి
కమ్మగ పరిమళాల స్వాగతించె

దినకర మయూఖ తంత్రులపై
శుభకర సంగీతము  పలికింప
మధుపబృందముల సవ్వడి
శ్రీకరములై ఎల్లెడల వినిపింప

చలించు పత్రముల మెరుపులు
గలగల మంత్రములు పఠింప
జలజలమని ప్రవహించు నీటి
తరగలలో సితార గానము తోచె

రవికాంతుల సోయగాలు
గగనాన ఆవిష్కరించు
రమణీయ వర్ణాల చిత్రమాలికలు
ఇలకూ కన్నులకూ కమనీయము కాదే!

వర్ణశోభితముగ మనమును
శోభలతో నింపు వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు