సునంద భాషితం '- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -354
స్వప్న వ్యాఘ్ర న్యాయము
*******
స్వప్నము అనగా కల.వ్యాఘ్ర అనగా, పులి పెద్ద పులి.
కలలో కనపడిన పెద్దపులి భయంకరంగా నిద్రలో భయపెట్టిననూ  మెలకువ రాగానే కలతో పాటే కనబడకుండా పోతుంది.
 కలలు రావడం సహజం. ఆ కలలు ఎందుకు వస్తాయి?ఆ కలలకు,నిజ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? కలల గురించి కొన్ని విశేషాలు విషయాలు తెలుసుకుందాం.
 మన మెదడులో ఉండేటటువంటి అమిగ్డాలా,హిప్పో కాంపస్ వంటి భాగాల నుండి మన మెదడు కొన్ని సంకేతాలను గ్రహిస్తుంది. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.ఆ చేసుకునే ప్రయత్న ఫలితంగా కలలు వస్తాయని శాస్త్ర వేత్తల పరిశోధనలో తేలింది.మన జ్ఞాపకశక్తిలో నిలువ వున్న జ్ఞాపకాలు, అనుభవాలు మిళితమై కలలుగా ఉద్భవిస్తాయి.నిద్ర సమయం మించి పోయినప్పుడు మనల్ని నిద్ర పుచ్చేందుకు మెదడు చేసే ఒక మాయ ఈ కల అని పరిశోధకులు అంటారు.
మరి అమిగ్డాలా మరియు హిప్పో కాంపస్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
అమిగ్డాలా అంటే మన మస్తిష్క అర్థ గోళంలో దాదాపు బాదం ఆకారంలో ఉండే బూడిద రంగు పదార్థము.ఇది భావోద్వేగాల అనుభవంలో పాల్గొంటుంది.
అలాగే హిప్పో కాంపస్ ఇది ఒక సంక్లిష్టమైన నాడీ నిర్మాణము, బూడిద రంగు పదార్థాన్ని కలిగి వుంటుంది.ఇది సముద్ర గుర్రం ఆకారంలో ఉంటుంది.ప్రేరణ మరియు భావోద్వేగాలలో సన్నిహితంగా పాల్గొనడమే కాకుండా జ్ఞాపకాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మనలో చాలామందికి నిద్రలో రకరకాల కలలు వస్తాయి. కొందరికి అందమైన సుందర దృశ్యాలు కలలోకి వస్తే,మరి కొందరికి భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. వీటికి కారణాలను వెతకడానికి పరిశోధకులు కొన్ని పరిశోధనలు చేశారు.
కలలు రావడం వ్యాధి కాదు.కానీ కలలు రావడానికి అనేక కారణాలున్నాయి.కలలు వాస్తవానికి యాదృచ్ఛికమైన ఆలోచనలని నమ్మినప్పటికీ మన మెదడులోని కార్యాచరణను అర్థం చేసుకోవడానికి కలలు ఒక మార్గమని మన శాస్త్రవేత్తల అభిప్రాయం.
కలలలో ముఖ్యంగా మూడు రకాల కలలు వుంటాయని  కలలకు సంబంధించిన ఓ శాస్త్రం చెబుతోంది.అదే స్వప్న శాస్త్రము.అవి చింతజములు, వ్యాధి జములు, యాదృచ్ఛికములు.
 వీటిలో ఏదైనా విషయానికి సంబంధించి పదే పదే ఆలోచిస్తే వచ్చే కలలను చింతజములు అంటారు.అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వచ్చే కలలను వ్యాధిజములు అంటారు.ఇక చివరగా మన ఆలోచనలతో ఎలాంటి సంబంధం లేకుండా వచ్చే కలలను యాదృచ్ఛికములు అంటారు.
అయితే కలలలో వచ్చే, కనిపించే దృశ్యాలు, వస్తువులు, జంతువులు,పక్షులు, సంఘటనలను బట్టి మంచి, చెడులు జరుగుతాయని స్వప్న శాస్త్రము రాసిన వారు చెప్పారు కానీ వాటిని నమ్మి మనసును, శరీరాన్ని అనారోగ్యానికి గురి చేయవద్దని శాస్త్ర వేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు.
అయితే తరచూ పీడకలలు వస్తుంటే మాత్రం దానిని  మామూలు విషయంగా వదిలివేయవద్దని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.నిత్యం పీడకలలు వచ్చే మధ్య వయస్కులలో వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుందనీ, స్పష్టంగా ఆలోచించలేకపోవడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవడం,తరచూ గందరగోళానికి గురయ్యే పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. కాబట్టి అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించి వారిచ్చిన సలహాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలితో సరైన నిద్రకు ప్రణాళిక వేసుకోవడం వల్ల అలాంటి పరిస్థితుల నుండి అధిగమించవచ్చని చెబుతున్నారు.
 కలలు వాస్తవాలు కావని ముందు గ్రహించాలి.ఎలాంటి కలలైనా రావడం సహజమని భావించాలి. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్నట్లు నిజమయ్యే కలలను కనాలి.ఆ కలలను సాకారం చేసుకోవాలి.
మరి ఈ స్వప్న వ్యాఘ్ర న్యాయమును మన పెద్దలు ఎందుకు చెప్పారో చూద్దాం.
కలలు నిద్రలో మన మనసును కప్పిన మాయా మేఘాల వంటివి.అవి కప్పి వున్నంత సేపు మనమేమిటో మనకు అర్థం కాదు.అవి విడివడినంతనే మళ్ళీ మామూలు స్థితికి వస్తాము.వాటిని గురించి అధికంగా ఆలోచించవద్దని చెప్పారు.
కాబట్టి కలలలో భయపెట్టే పులులు సింహాల లాంటివి ఏవొచ్చినా ఉదయం గుర్తుంటే తేలికగా తీసుకుందాం.ఇక గుర్తు లేకపోతే సమస్యే లేదు కదా!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు