సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -335
సుమ సౌరభ న్యాయము
******
 సుమ అంటే పువ్వు, పుష్పము, విరి. సౌరభం అంటే సువాసన ,తావి, పరిమళం, సుగంధం మొదలైన అర్థాలు ఉన్నాయి.
పూవుకు తావికి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది.
వెలుతురు,-నీడ, ఉరుము,-మెరుపు, శబ్దము -అర్థము.. ఇలా ఒకదానికి ఒకటి విడదీయరాని బంధం కలిగి ఉంటాయి.
అలాగే పూవుది తావిది కూడా విడదీయరాని బంధం.తావి వుంటేనే పువ్వుకు ఎంతో గౌరవం.తావి వున్న పువ్వులనే ఎవ్వరైనా  ఇష్టపడుతారు. వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారు. 
అలాంటి పూవు ఓ పవిత్రమైన, సున్నితమైన,ఉన్నతమైన హృదయానికి, మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక. తాను ఎక్కడ ఉన్నా తనను గుర్తించమని ఎవరినో బతిమిలాడాల్సిన అవసరం లేదు.తన సంస్కారవంతమైన హృదయ పరిమళమే  తానేంటో తెలుసుకునేలా  చేస్తుంది. విసురుగా వీచే గాలిని కూడా పరిమళభరితం  చేస్తుంది.పూవుకు ఉన్న  మరో గొప్ప సంస్కారం ఏమంటే  కోసే చేతులకు కూడా తనలోని సుగంధాన్ని    అద్దుతుంది.
పూవులను గమనించినట్లైతే  ఏ కొమ్మకు పూచినా ఆ కొమ్మ అగ్రస్థానంలో పూస్తుంది. హుందాగా తలెత్తుకొని అందరినీ ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు కనిపిస్తుంది.
 మరి ఈ "సుమ సౌరభ న్యాయమును ఉదాహరణగా పెద్దలు ఎందుకు చెబుతుంటారంటే...
కొందరు వ్యక్తులు పువ్వుల్లా పరిమళిస్తూ వుంటారు. వారి మనసు,మాట పూవంత మృదువుగా ఉంటుంది. వారు తాము చేస్తున్న మంచి పనుల గురించి చెప్పుకోక పోయినా 'పూవు దాగినా  పరిమళం దాగునా ' అన్నట్లు వారి  సేవలు అలా సమాజమంతా గుబాళిస్తుంటాయి.
 అలా "వ్యక్తి లోని ప్రతిభ పూవులోని పరిమళం ఎంత దాచినా దాగదు" అంటుంటారు.
కొన్ని  పూలను గమనించినట్లైతే ..పూవు చిన్నదా పెద్దదా అని కాకుండా  ప్రతి పూవు తనదైన   ప్రత్యేక సౌరభాన్ని కలిగి ఉంటుంది. అలాగే వ్యక్తులు కూడా చిన్నా,పెద్దా,రంగు, రూపు, ఆస్తి అంతస్తు  అనే వయో భేదం లేకుండా  మానవీయ విలువలతో గుబాళిస్తుంటారు.
 అలా వారి స్నేహం, పరిచయం చేసుకుంటే పూల దండలో దారంలా మనకూ ఆ సౌరభం సోకి జన్మ ధన్యం అవుతుంది. 
అందుకే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు"సాధు సంగమమున సామాన్యుడును గూడ/ మంచి గుణములను గ్రహించుచుంఢు/ పుష్ప సౌరభంబు పొందదా దారంబు/ లలిత సుగుణ జాల తెలుగు బాల!"
 ఎంత సామాన్యుడైన వ్యక్తి కూడా మంచి వారితో సహవాసము చేసినట్లయితే,పూవుల దండను కట్టిన దారానికి పరిమళం అంటుకున్నట్లు గౌరవింపబడుతారని అంటారు.
కాబట్టి మనమూ పూవు తావిలా ఎల్లప్పుడూ మంచితనం,మానవత్వం వీడకుండా సమాజంలో  మనదైన వ్యక్తిత్వంతో గుబాళిద్దాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు