చితి మంటలు- సి.హెచ్.ప్రతాప్

 చింతన అంటే చిత్తములో జనించినది అంటే ఆలోచన.కొంచము బాధాకరమైన ఆలోచన.చింతన అంటే పలుమార్లు తలచుకోవడం. ఫలానా దానిగురించి ఎడతెగని ఆలోచనే చింతన. దానిని మనసుకు అలవరచి పరబ్రహ్మం వైపు మరలించడమనేది మనిషి ప్రయత్నపూర్వకంగా చేయవలసిన సాధన. అప్పుడు మాత్రమే చింతన సార్థకమవుతుంది.అన్ని బాధ్యతలూ నెరవేరిన తర్వాత కూడా ఏదో నిస్తేజం వారిని ఆవహిస్తుంది. ఇంకేదో పొందాలనే ఆశ. మరేదో కోల్పోయాననే నిరాశ. ప్రశాంతంగా ఉండకుండా, భగవంతుడి గురించి ఆలోచించకుండా గతం గురించి చింత చేస్తూ  ఉంటాడు. సుఖదుఃఖాల ఆటుపోట్లే జీవితం. ఎవరి జీవితమూ పూర్తిగా సంతోషభరితంగా ఉండదు. దుఃఖంతోనే నిండిపోదు. కానీ, తనకు గతంలో ఎదురైన చేదు సంఘటనలను తలచుకొని ఆవేదనలో కూరుకుపోతుంటాడు. ఆ దుఃఖం ఎవరికీ రానిదని, రాకూడదని అందరికీ చెప్తుంటాడు. ఎన్నడో ముప్పయ్‌, నలభై ఏండ్ల కిందట జరిగిన విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ కుమిలిపోతుంటాడు. అంటే అతను ‘చింత’నే ‘చింతన’గా మార్చుకుంటున్నాడు. అది మాత్రం స్వయంకృతాపరాధమే. చితి మంటల కంటే హృదయం లో రేగే చింతన మంటలు మరీ దుర్భరమైనవి . పంచ ప్రాణాలు నిష్కృమించాక నిర్జీవమైన పార్ధీవ దేహాన్ని కాల్చేది చితి ,  అయితే సశరీరులుగా వుండగానే దహించేది చింతన. అనుక్షణం నరక అనుభవం చవి చూపించేది చింతన .  ఇతరులతో అనుక్షణం పోల్చుకుంటూ ,ఉన్నదానితో సంతృప్తి పడక,ఇంకేదో కావాలనుకుంటూ అశాశ్వతమైన వాటిని సాధించేందుకు అర్రులు చాస్తూ, కోరికల పుట్టలో మునిగిపోయి వాటిని సంతృప్తి పరచుకునేందుకు పరుగులు తీస్తూ హృదయాన్ని అల్లకల్లోలం చేసుకుంటూ జీవించడం నరకయాతనతో సమానమని శాస్త్ర వాక్యం చెబుతోంది. శారీరక గాయములు ఔషధ సేవ వలన ఉపశమిస్తాయి.  కాని మానసిక గాయం ఏ ఔషధములకు లొంగనిది, మానవులను ప్రతీ క్షణం దహించి వేస్తాయి. అసూయ, అహంకారం,లోభం,మోహం రౌద్రం,క్రోధం ఇత్యాది అసురీ లక్షణములు మానవులలో చింతనను పెంచుతాయి. చిత్ర విచిత్రమైన వ్యాధులకు శరీరం అలవాలమౌతుంది. ఔషధ సేవ చేస్తూ  శారీక బాధల నుండి ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తే మళ్ళి కొత్త కోరిక పుట్టుకొచ్చి మానసిక చింతనకు గురవుతాము. ఈ చక్రభ్రమణం నుండి బయటపడేందుకు ధృఢమైన మానసిక సంకల్పం అవసరం. శాశ్వతం, అశాశ్వతమైన వాటి మధ్య వ్యత్యాసం గమనించుకునే వివేకం అలవరచుకొని, అశాశ్వతమైన కోరికల సాధనకోసం పరుగులు క్రమక్రమంగా తగ్గించుకుంటూ , ఉన్నదానితో సంతృప్తి పడడం నేర్చుకుంటూ ,జరిగినది, జరుగుతున్నది, భవిష్యత్తులో జరిగేవన్నీ మన మంచి, అభ్యున్నతి కోసమే భగవంతుడు సంకల్పించాడని నమ్ముతూ ప్రసాద భావంతో,ఆత్మ సంతృప్తితో  జీవించదం ఎంతో అవసరం. చింతన నుండి బయట పడడం మన తక్షణ కర్తవ్యం. ధ్యానం, యోగం,ప్రాణాయామం, భగవన్నామస్మరణ, సత్సంగం, సద్గంధ పఠన, పుణ్య క్షేత్ర దర్శనం , మహా పురుషుల పాద స్పర్శనం ఇత్యాది సత్కర్మల వలన హృదయమును పవిత్ర పరచుకొని సన్మార్గం లో నడత సాగిస్తే ఎట్టి చింతనలు దరి చేరవు . అన్ని జన్మలలో కంటే ఉత్కృష్టమైన , అతి దుర్లభమైన మానవ జన్మను పొంది నమో విశ్వరూపాయ నమ: అను రీతిన ఆ పరమాత్మను గుర్తించి ఉపాసించలేని జీవితం వ్యర్ధం. నామ, రూప, గుణ రహితమైన ఆ పరబ్రహ్మమును దర్శించడమే మన జీవిత లక్ష్యం  గమ్యం పరమావధి కావాలి. హృదయమును వివేకపూరితంగా , ఆత్మను మలిన రహితంగా చెసుకొని కఠినమైన తపస్సుతో , సాధనతో అరిషడ్వర్గములను లోబర్చుకొని , దుష్ట సంస్కారములను రూపు మాపుకొని పరమాత్మను దర్శించి జన్మ సాఫల్యం  పొందడమే మన కర్తవ్యం. 
కామెంట్‌లు