సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -387
అదగ్ధ దహన న్యాయము
******
అదగ్ధము అనగా కాల్చబడనిది.దహన అనగా దహించునది,నిప్పుచే కాల్చివేయునది, అగ్ని, కాల్చుట అనే అర్థాలు ఉన్నాయి.
అదగ్ధ దహనము అంటే కాల్చబడని దానిని అగ్ని కాల్చదు .ఏది కాల్చబడదు అంటే అందుకు ముందే ఒకసారి కాల్చబడి బూడిదగానో ,రూపం లేకుండా అయినదో అని అర్థము.అంటే ఇక్కడ కట్టెను దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది.అగ్ని ఎప్పుడు కూడా పచ్చిగా లేదా ఎండుగా వున్న కట్టె/ కర్రలనే కాల్చుతుంది కానీ అప్పటికే కాలిపోయిన దానిని కాల్చదు అని అర్థము.
దీనినే మన పెద్దవాళ్ళు జీవితానికి అన్వయించి "సంసారబంధము అనే  అగ్ని రాగాసక్తునికే రాగ రహితునకు అంటుకోదు" అన్నారు.
మరింతకూ రాగాసక్తుడు అంటే ఏమిటా అనే సందేహం ఎవరికైనా రావచ్చు.ప్రీతి,ప్రేమ, అనురక్తి, మమకారం మొదలైన వాటి పట్ల ఇష్టం, కోరిక పెంచుకున్న వాడు అని అర్థం.
రాగ రహితుడు అంటే అవేమీ లేని వాడు.వాటికి అతీతంగా వుండే వాడని అర్థం.

అదగ్ధము,దహనము అనే పదాలు అగ్నికి సంబంధించినవి. కాబట్టి ఈ సందర్భంగా అగ్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం....
ఈ చైతన్యవంతమైన ప్రపంచంలో ఏది గ్రహించదగినదో అది అగ్ని స్వరూపమని అంటారు.అంతే కాదు అగ్ని అన్ని జీవులలో,ప్రతి చోటా వుంది.అగ్ని విశ్వవ్యాప్తంగా ఉంది .అగ్ని అంటే క్రియ అని, సృష్టి అని, నాశనము అని, పరివర్తన కూడా అని అగ్ని సూత్రాలలో నిర్వహించబడింది.
 మరి ఆ అగ్ని సంసార బంధం కలిగిన రాగాసక్తునికే అనగా రాగద్వేషాలు కలిగిన వ్యక్తినే అంటుకుంటుంది. అంటే  రాగద్వేషాలు, సంసారబంధములతో కట్టుబడిన వ్యక్తి పచ్చికట్టె లాంటి వాడు. రాగద్వేషాలు అనే కోరికలతో నిండిన వాడు. భార్యా పిల్లలు అనే సంసార బంధంలో చిక్కుకున్న వాడు. ఇలా అజ్ఞానం వల్ల కలిగే శరీర బంధం , అహంకారం అనే మానసిక బంధం కోరికలతో నింపబడి వుంటుంది.ఈ కోరికలు నెరవేరేకొద్దీ వాటి తీవ్రత పెరుగుతుంది.ఇక్కడ కోరిక నెరవేరడం అనేది విముక్తికి మార్గం కాదు. కోరికలు అగ్నిలా రగులుతూ మరింత బలంగా మారుతాయి.
కాబట్టి కోరికలను కోరకుండా వుండాలి.కోరిక లేని, కోరిక నుండి పూర్తిగా విముక్తి పొంది, కోరికలను విదిలించుకుంటే , అలా ఆత్మ సంతృప్తి పొందే వ్యక్తి చెందే వ్యక్తిని వదిలేస్తాయి.ఇలా హృదయంలో గూడు కట్టుకున్న కోరికల పక్షులు ఎగిరిపోయి, హృదయంలో ఏమీ మిగలనప్పుడు  అంటే రాగ రహితుడైనప్పుడు అగ్ని అంటుకోదు.అతడు ముందుగానే కాల్చబడిన లేదా  కాల్చడానికి వీలు పడనివాడు.కాలిపోయిన కర్ర పదార్ధాలను అగ్ని మళ్ళీ కాల్చలేదు కదా!
 బుద్ధ భగవానుడు ఇదే విషయాన్ని ఇలా చెబుతాడు."కోరికలు దుఃఖానికి హేతువులు కాబట్టి కోరికలను లేకుండా చేసుకోవాలి "అని.
అలాగే ఈ న్యాయానికి కొంత దగ్గరగా ఉన్న వేమన పద్యాన్ని కూడా చూద్దాం.
"అన్ని జాడలుడిగి ఆనంద కాముడై/నిన్ను నమ్మజాలు నిష్ఠ తోడ/ నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీ యాన/ విశ్వధాభిరామ వినురవేమ"
అన్ని మార్గాలను నశింపజేసుకుని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తే,అప్పుడే ధర్మాచరణలో దైవం మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు.నిజం చెప్తున్నాను.దైవాన్ని పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని వేమన ప్రబోధిస్తున్నాడు.
 అనగా రాగద్వేషాలకు అతీతమైన ఆనందమయ జీవితాన్ని గడపాలంటే అన్ని జాడలు మనసులో ఉడిగి పోయేలా చేసుకోవాలి. అప్పుడే  కోరికల నుంచి విముక్తి కలుగుతుంది.ముక్తి లభిస్తుందన్న మాట.
ఏమిటో ఈ ముక్తి, విముక్తి,రాగ ద్వేషాలు,రాగాసక్తత అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కోరికలనే  మోహావేశాలకు,పాశాలకు లోనవకుండా ఉండ గలిగితే ఎలాంటి అగ్ని అంటుకోదు.ఐహిక బంధాల బాధలు వుండవు అనేదే ఈ "అదగ్ధ దహన న్యాయము" లో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన అంతరార్థము.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు