సుప్రభాత కవిత ; -బృంద
మంచు కురిసే దారుల్లో
మనసు దోచే రంగులు
దిగివచ్చే మబ్బులతో
నింగి పంపు సందేశాలు

పలకరింపుల నవ్వులతో
పులకరించే పుడమి
కల వరించే క్షణం కోసం
కలవరించే  కనులు

పాలమబ్బుల పల్లకీలో
నీలి గగనం పంపే
తేలి వచ్చే కబురుకోసం
గాలి ఈలతో గాలింపు

కంటి చూపుతో బెదిరించినా
మాట వినక మారాం చేస్తూ
అల్లరిగా అడ్డు వచ్చి
కొండ నుదుటికి కొట్టుకుంటూ

అడ్డులేదు మాకంటూ
అలవికాని వేగాన
పరుగులిడు మబ్బులకు
అడ్డంగా నించున్న శిఖరాలు

మార్పో...తీర్పో...
తిమిరమో.....సమరమో
వెలుగో......గెలుపో
సందేహమో...సమాధానమో

తెలియనివ్వని కాలం
మాయలో ముంచేసి
మమతలు పెంచేసి
తనకేమీ పట్టనట్టు సాగిపోయే
వేగం

ప్రతిరోజొక కొత్త అవకాశం
ప్రతి గంటా కొత్త పాఠం
ప్రతి నిమిషం కొత్త ఆనందం
ప్రతి రేపూ కొత్తదే!

కొత్త వెలుగుల నిత్యోత్సవానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు