సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -389
అర్థ కుక్కుటీ న్యాయము
****
అర్థ అంటే సగము.కుక్కుటి అనగా ఆడ కోడి,అడవి కోడి,కొఱవి.
కోడిని కోసి సగభాగాన్ని తినుటకు, తక్కిన సగము గుడ్లు పెట్టించుటకు ఉపయోగించుకోవచ్చు అనుకున్నట్లు.
 ఈ  న్యాయము యొక్క అర్థము చదువుతుంటేనే ఇది వెర్రి వెంగళప్ప లాంటి వ్యక్తి మూర్ఖత్వానికి పరాకాష్టగా అనిపిస్తుంది కదూ!
కోడిని కోయడం అంటేనే  చంపడం.ఇక ఆ తరువాత దానిని  సగం తినడానికి సరే .మిగతా సగం గుడ్లు పెట్టించడానికి ఎలా  వుపయోగిస్తాడు?.
ఇది అమాయకులను మోసం చేయడానికి కావచ్చు. లేదా అతడే అత్యంత అమాయకుడు కావచ్చు .లేదా ఇచ్చిన దానిని సరిగా ఉపయోగించుకోలేని అత్యాశ  కావచ్చు.
 మరి మనం దీనికి సంబంధించి ఓ సరదా కథను చూద్దామా...
అనగనగా ఒక ఊరిలో  ఒక పేద వ్యక్తి ఉండేవాడు. అతడు,అతడి భార్యతో కలిసి కూలీనాలీ చేసుకుంటే వచ్చే  ఆదాయం కుటుంబాన్ని నడపడానికి సరిపోయేది. అంతో ఇంతో వెనకేసుకు ఉందామని ఎంత అనుకున్నా వీలు పడేది కాదు. అలా రోజులు గడుస్తున్నాయి.
 ఓ రోజు కూలి పనికి పోయి వచ్చేసరికి తన ఇంటి ముందు అరుగు మీద ఓ వ్యక్తి  చలికి గజగజా వణుకుతూ కనిపించాడు.
అయ్యో పాపం! అనుకుని వెంటనే లోపలి నుంచి ఓ దుప్పటి తెచ్చి ఇచ్చాడు.అతడు తిండి తినలేదని తెలుసుకుంటడు.తాము వండుకున్నది ముందుగా అతనికి కడుపు నిండా పెట్టి ఆకలి తీరేలా చేస్తాడు.అతనికి తమ ఇంట్లో మంచం వేసి పడుకొమ్మని చెబుతాడు.
 తనను ఇంత మంచిగా చూసిన ఆ కుటుంబానికి ఏదో ఒక మేలు చేయాలని తన దగ్గర ఉన్న  కోడిని ఇస్తూ "ఇది చాలా మహిమ గల కోడి.ఇది రోజుకో బంగారు గుడ్డు పెడుతుంది.దీనితో నీ పేదరికాన్ని పోగొట్టుకో!" అని  చెప్పి పొద్దున్నే వెళ్ళిపోతాడా వ్యక్తి.
 దానిని గంప కింద పెట్టి పనులు చూసుకుని వచ్చే సరికి బంగారు గుడ్డు కనిపిస్తుంది.
ఇంకేముంది అలా  రోజుకో గుడ్డు పెడుతుంటే అమ్మి  బాగా ధనవంతులు అవుతారు. మేడలు, మిద్దెలు ఆస్తులు అంతస్తులు పెరిగే కొద్దీ అతడిలో అత్యాశ, దురాశ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది.
 రోజుకో గుడ్డు పెట్టే కోడి కడుపులో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసి అమ్ముకుంటే బోలెడు డబ్బు వస్తుంది కదా అనుకుని దాన్ని కోస్తాడు. అందులో ఏమీ లేవు. ఏడ్చి మొత్తుకున్నా  ఏం లాభం?. చచ్చిన కోడి బతకదు కదా!
 ఇది దురాశకు, అత్యాశకు సంబంధించిన కథగా చెప్పుకోవచ్చు.
 శ్రీల ప్రభుపాద  గారు తన శ్రీ చైతన్య చరితామృత ఆది లీలలో చైతన్య మహా ప్రభు ఉటంకించిన స్మృతి ప్రస్థానం అయిన గీత, విష్ణు పురాణము మొదలైన వాటి నుంచి ఆధారాలను ఉదహరించారు.
మరి ఈ 'చరితామృత లీల గ్రంథము'లో" అర్థ కుక్కుటీ న్యాయము" గురించి ఏమన్నారో చూద్దాం.
 సగం నమ్మకం, సగం అపనమ్మకాన్ని "అర్థ కుక్కుటీ న్యాయము"తో అంటే "సగం కోడి  యొక్క తర్కం"తో పోల్చి చెప్పారు.
అంటే కోడిని సగానికి కోసి నోటిని వేరు చేయడం, అనవసరంగా తిండి దండగ అనుకునే మూర్ఖత్వం గుడ్డు పెట్టేది వెనుక వైపు నుండి లాభం పొందాలని అనుకోవడం అన్న మాట.
 కోడి యొక్క యజమాని రోజూ తన కోడి నుండి గుడ్డును‌ పొందడం ఓర్వలేక అతడు ఆదాయం రాకుండా ,లబ్ధి‌ పొందకుండా చేసేందుకు కొంతమంది దుష్టులు అతని మనసు మారేలా చేస్తారు .కోడి నోరును చూపి ఇది  నోటి ద్వారా చాలా ఖరీదైన ఆహారం‌ తింటుంది. కాబట్టి దాని నోరును‌ కోసేయమని,కత్తిరించమని చెప్పి గుడ్డు  పెట్టే వెనుక వైపు తీసుకొమ్మని‌ చెబుతారు. అది నమ్మిన‌ కోడి యజమాని వాళ్ళు చెప్పినట్లు చేసి మోసపోతాడు.
ఈ విధంగా "అర్థ కుక్కుటీ న్యాయము"లో రెండు కోణాలు కనబడుతూ వున్నాయి. ఈ రెండు కోణాల్లో ఒకటి అమాయకత్వం, దురాశ గురించి చెబితే, మరొకటి ఇతరుల మాటలు విని మోసపోవడం  కనిపిస్తాయి.
వివేకం,విచక్షణా జ్ఞానం లేకుండా వుంటే ఇలాంటివి జరుగుతూనే వుంటాయని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు