సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -392
అహిభుక్కై వర్త న్యాయము
*****
అహిభుక్కు అనగా నల్లమందు తినేవాడు.కైవర్తుడు అనగా చేపలు పట్టు వాడు.
నల్లమందు తిన్న ఉన్మత్తుడు మరియు జాలరి కథ.మన పెద్ద వాళ్ళు ఓ మాట తరచూ అంటుంటారు.పత్యం పరాకాష్టకు చేరితే, (ఒళ్ళు సోవి) తన స్పృహ తనకు తెలియక పోతే ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి కథలో చూద్దాం.
నల్లమందు  బాగా తిని  నిషాలో  ఎక్కువైన  వాడొకడు  ఒక పడవను ఎక్కుతాడు. అంత మత్తులోనూ వాడికి దేహ స్పృహ వుంది.తాను ఈ మత్తులో ఒళ్ళు తెలియక నీళ్ళలో పడిపోతానేమోననే భయం వేస్తుంది.అలా పడిపోకుండా వుండటానికి ఒక తాడును తీసుకుని తన కాలికి, పడవకున్న కొక్కానికి కలిపి కట్టుకుంటాడు.ఆ తర్వాత అతడికి గాఢమైన నిద్ర పట్టింది.
అదే పడవలో ఒక చేపలు పట్టే వాడు కూడా ఉంటాడు.ఈ నల్లమందు తిన్న వ్యక్తిని, అతడు కాలికి పడవకు కలిపి కట్టుకున్న తాడును చూస్తాడు. జాలరి వాడికి సరదా ఐన ఆలోచన వస్తుంది.దాంతో మత్తులో వున్న అతడిని  ఏడిపిద్దామని అనుకున్నాడు.అతడు నిద్ర పోయింది గమనించి  అతని కాలికి కట్టుకున్న తాడు విప్పేసి తన కాలికి కట్టుకుంటాడు.
అలా కొంత సేపటికి నల్లమందు తిన్న వ్యక్తికి మెలకువ వస్తుంది.తన కాలికి కట్టుకున్న తాడు లేదు.జాలరి వాని కాలికి కట్టి వుండటం చూస్తాడు.
నల్లమందు తిన్న  ఉన్మత్తుడికి ఇంకా మత్తు దిగలేదు.దాంతో తన కాలుకు కట్టుకున్నది జాలరి వాడి కాలికి వుండటంతో జాలరి వాడు తాను వేరు వేరు కాదు తానే వాడు వాడే తానుగా రెండుగా విడిపోయామని అనుకుంటాడు.అంతటితో ఆగకుండా"వాడే నేను నేనే వాడనే ఓ ఉన్మాద స్థితికి వస్తాడు.ఆ స్థితిలోనే "ఓ జాలరీ!నీకూ నాకూ భేదం లేదు.నేనే నీవు,నీవే నేను "  తానే రెండుగా విడిపోయినట్లుగా ఊహిస్తూ వాదించడం మొదలు పెడతాడు.
ఎవరో కవి రాసినట్లు "తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తుందన్న" అన్నట్లు కాకుండా ఇలాంటి ఉన్మాదమైన మాటలు కూడా వస్తుంటాయని మనకు ఈపాటికి అర్థమై పోయింది కదా!వాడేదో  బాగా నల్లమందు తిని ఆ మత్తులో అంటున్నాడు. అది అవసరమా? ఇలా తాగిన మరియు తిన్న మత్తులో  ఏదేదో మాట్లడుతూ వుంటారు కదా! అని మనకు అనిపించవచ్చు కానీ దీనిని మన పెద్దవాళ్ళు ఓ న్యాయంగా ఎందుకు చెప్పారో చూద్దాం.
అలా మత్తులో వున్న వ్యక్తులైతే సరేలే అది పరిపాటే కదా! అనుకోవచ్చు. కానీ జాతర్లు, సంతల్లో కొందరికి పూనకాలు వస్తూ ఉంటాయి.అప్పటి వరకు  బాగానే వున్నవాళ్ళు చటుక్కున ఊగిపోతూ "నేను ఫలానా  దేవతను .నేను ఫలానా దేవుడిని" అని దేవుళ్ళ పేర్లు చెబుతూ అది కావాలి ఇది కావాలి అని కోరికలు కోరుతుంటారు.అలాంటివి  నమ్మే వాళ్ళకు  ఒకేసారి జ్వరమానినిలో  జ్వర తీవ్రత నూటా ఐదుకు పెరిగినట్లు పెరుగుతుంది.ఇంకేముంది. కోరిన కోర్కెలు నెరవేరుస్తామని వాగ్దానాలు ఇవ్వడం, ముడుపులు చెల్లిస్తామని  మొక్కడం చూస్తూ వుంటాం.
అంటే వాళ్ళ మత్తుతో , వాళ్ళ పూనకాలతో 'వాళ్ళ ఏడుపేదో  వాళ్ళే ఏడిస్తే' సరిపోయేది కానీ ఎదుటి వారిని కూడా యిబ్బంది పెట్టడమే బాగా లేదు కదా!
ఈ "అహిభుక్కై వర్త న్యాయము"ను ఇలా రెండు కోణాల్లో చూడవచ్చు.ఒకటేమో మత్తు ఎక్కువై ఏం మాట్లాడుతున్నారో  వాళ్ళకే కాదు ఇతరులకూ అర్ధం కాదు.ఇక రెండవది మోసపూరితమైనది.భక్తి పేరుతో జనాలను మోసం చేయడం.ఓ రకమైన మత్తులో ముంచేయడం.ఇలా రెండు రకాల వాళ్ళు వుంటారు.మొదటి రకం  వాళ్ళది మూర్ఖత్వం.రెండవ రకం వారిది కపటత్వం.ఇలా రెండు రకాల వాళ్ళు వుంటారని  చెప్పేందుకు కూడా ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మూర్ఖులతో వాదన కష్టం.కపటులతో సహవాసం నష్టం. అలాంటి వారికి దూరంగా వుండటమే ఉత్తమం. అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు