చింతల తొవ్వ....- ప్రమోద్ ఆవంచ- 7013272452

 స్వచ్ఛమైన తెలంగాణ పల్లె జీవితమే కవి తుల శ్రీనివాస్ రాసిన చింతల తొవ్వ.ఈ పుస్తకం చదివిన ప్రతివారు తమ ఊర్లల్లోకి వెళ్ళి తమ బాల్యాన్ని తడుముకుంటారు.సంతోషాల చలమ ఊరుతూంటే జ్ఞాపకాల బావుల్లో ఈతలు కొడుతారు .బాల్యంలో పడ్డ కష్టాలు, అవమానాలు,తోటి వారితో పోల్చుకుని పొందిన ఆత్మ న్యూనతా భావాలు, ఇవన్నీ ఉన్నా.. స్నేహితులతో అన్నీ మర్చిపోయి గడిపిన క్షణాలు,అప్పటి సంఘటనలను నెమరువేసుకుంటూ, అనేకానేక అనుభవాలను,మననం చేసుకుంటూ ఉంటే గుండె తడై,రెప్పలను కప్పుకొన్న కన్నీళ్లు కంటి చివర్నించి చినుకై రాలి ఆవిరవ్వక మానదు.ఈ పుస్తకంలో కవిత్వం అంతా అమ్మ,నాన్న, ఊరు, ఊర్లో వాడకట్లు, ఒక్కొక్క వాడకట్టులో ఉత్పత్తి కులాల కుల వృత్తులు,బాయికి పోయే తొవ్వలో కంచరోల్ల రాతెండి సర్వల చెమట మెరుపులు, ఎర్రని కొలిమిలో వెన్నుపూసను కాలుస్తూ నాగలి కర్రుకు రూపమిచ్చే వడ్లోల్ల వాడకట్టు,గడీలల్ల  రాత్రి వేషం కట్టే భాగవతులు గొంతు సవరించుకునే పాటిగడ్డ, సర్కారు తుమ్మలు,
మాస్టార్ల చేతుల్ల మంత్రదండాలయ్యే వాయిలి బెత్తాలు..
వాయిలి,సీతాఫల,చింత,సీమ చింత,రావిచెట్లు,
తుమ్మిష్కలు,రంగు రంగుల సీతాకోకచిలుకలు, వెండి వెన్నెల్లో మెరిసే ఇసుక తిన్నెలు,సెలవు రోజుల్లో పిల్లల ఆటలు, కేరింతలతో మురిసిపోయే ఇంటి వాకిండ్లు. లేత ముంజ కల్లంత తెల్లగా పారే వాగు నీళ్ళల్లో పాదాలు పర్చుకొని చేపపిల్లలా గంతులు వేసి,నడిచిన జ్ఞాపకాలు రెక్కలు తొడుగుతాయి.
                    ప్రతి ఒక్కరి బాల్యంలో అమ్మ తరువాత ఎక్కువగా గడిపేది తాతయ్య దగ్గరే.రాత్రి సమయాలు
ఆరుబయట నులక మంచంపై తాతయ్య పక్కన పడుకొని వెన్నెల ఆకాశాన్ని చూస్తూ, తాతయ్య చెప్పే కథలు వింటూ,ఆ కథల్లోని హీరోగా తనని తాను ఊహించుకుంటూ,మద్యలోనే నిద్రలోకి జారుకోవడం...
ప్రతి ఒక్కరి బాల్యంలోనూ జరిగి ఉంటుంది.కథ మధ్యలోనే నిద్రపోతాం కాబట్టి తాతయ్య చెప్పే కథలు ఎప్పటికీ సశేషమే అని అంటాడు కవి తుల శ్రీనివాస్. కంచుడువై, కాగువై, ఇంటిని సల్లగ జూసే కూరాడు కుండవై,గూనవై,గోలమై,గూనపెంకల గూడువై,గరిగబుడ్డి,
గల్లగురిగి,గంజి తొట్టి,కల్లులొట్టి,మారెసరు బుడ్డివై, మారెమ్మ బోనమై....మట్టి శిల్పాలెన్నింటికో ప్రాణం పోసి
కష్టానికి తగ్గ కాసు రాని పెంకాసు జీవితం నీది అంటూ మట్టిశిల్పం కవితలో కుమ్మరి ముత్తయ్య తాత చేతిలో ప్రాణకళ సంతరించుకున్న అద్భుతమైన మట్టి పాత్రల విద్య అంతరించి పోతున్నందుకు ఆవేదన చెందుతాడు.ఉన్న ఊరిలో ఉపాధి కరువై పట్టణాలకు వలస పోతున్న వృత్తి దారులు ఆవేదన కళ్ళముందు కదులుతుంది.ఆధునిక జీవితాలకు అలవాటు పడి,
మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పుల మూలంగా
కుల వృత్తులు మరుగునపడ్డాయి. కులవృత్తులపై రాసిన ఈ కవిత చదివే వాళ్ళను ఆలోచింపజేసేలా ఉంది.
ప్రస్తుతం ఊర్లల్లో ఆప్యాయతతో పలకరించే ఆ మనుష్యులేరి,కమ్మరి కొలిమిలేవి, కుమ్మరి కుండలేవి,వడ్లోల్ల వాడకట్టులో రంపం,బాడిశెలేవి,ఆ బాగవతులేరీ.... ఇవన్నీ, వీరందరూ కడుపు చేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్లారు.నిజంగా ఉత్పత్తి కులాలకు ఊర్లల్లో మనుగడ లేదు.ఇక్కడ లభించే డబ్బులు వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి నెలకొంది.
                నాన్న జ్ఞాపకంలో రాసిన కవితలో నువ్విచ్చిన
ఈ ఊపిరి దీపం నీ జ్ఞాపకాల ఉప్పెనలో ఊగిసలాడుతుందని అంటాడు.తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక నీ కళ్ళతో చూసిన ప్రపంచం ఇప్పుడు అంధకారమై తోస్తుంది... నాన్న జ్ఞాపకాలను ఈ కవితలో  చాలా హృద్యంగా వర్ణించాడు.చిటెకన వేలు పట్టుకొని
ప్రపంచాన్ని చూపించే నాన్న అంటే ధైర్యం.ఆ ధైర్యాన్ని,
అండను కోల్పోతే పొందే బాధ వర్ణనాతీతం.చింతల తొవ్వ అంతా, అమ్మ , నాన్న,ఊరు...ఊరుతో  పెనవేసుకున్న బంధాలు, పచ్చని పొలాలు, చెట్లు,ప్రకృతి,
కుల వృత్తుల చుట్టే తిరుగుతుంది... తెలంగాణా పల్లె
వాతావరణం, అక్కడి ఆప్యాయతలు, స్నేహితులు, చదువు చెప్పిన పంతుళ్లు.. అన్నీ, అందరూ,కళ్ళ ముందు
రీల్ లా తిరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తీయని జ్ఞాపకం కవితలో కవి శ్రీనివాస్, మామిడి చెట్టు ను నాన్నతో పోలుస్తూ, తీయని జ్ఞాపకాలను కాసే మామిడి చెట్టు మా నాన్నలా నిలబడి ఉందని అంటాడు.
ఎంత గొప్ప వ్యక్తీకరణ...కట్ చేస్తే...
               రచన అంటే ...మనోగత భావాలను, స్పష్టంగా, క్రమబద్దంగా,వ్యవహారిక భాషలో రాయడం,
పుస్తకాలను విస్తారంగా చదవడం మూలంగా నేర్చుకున్న శబ్దాలను తమ స్వంత వాక్యాలలో పొందుపరుచుట,
అధ్యయనం పట్ల ఆసక్తి కలిగి ఉండడం,రచనలో లోకానుభవాలను, జీవితానుభవాలను,కుల వృత్తులను
పొందు పరచడం, స్థానిక భాషలో,యాసలో మాట్లాడడం,ఇతరుల రచనలు చదివేటప్పుడు వాళ్ళ భావాబివ్యక్తికరణ,శైలి బేధాలను పరిశీలించుట వలన మనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచునే అవకాశం ఉంటుంది.పల్లె యాసను వంటబట్టించుకున్న కవి తుల. శ్రీనివాస్ తనదైన  ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. పల్లెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ తాను పడ్డ సంఘర్షణ, ఆవేదనను అద్భుతంగా ఆవిష్కరించాడు.ఈ రచనలో తుల శ్రీనివాస్ తన ఆత్మావిష్కరణ,ఆత్మాభివ్యక్తి,తన మనోభావాలను, నిశ్చితఉద్దేశ్యాలను,తన ఊరుని,తన బాల్యాన్ని కళాత్మకంగా అభివ్యక్తీకరించాడు. తెలంగాణ జీవకవి మునాసు వెంకన్నలాంటి సాహిత్య స్థాయిలో ఉన్న ఈ కవిత్వం పాఠకుడి పంచేంద్రియాలకు పసందైన విందు భోజనం.వెంకన్న కవిత్వం కూడా ఇలాగే 
మనల్ని వెంటాడుతూ ఉంటుంది.జీవితంలో ఏదో
కోల్పోయినట్లు,మన రక్త సంబంధీకులు మన చుట్టే
తిరుగుతున్నట్లు,మనం నిర్లక్ష్యం చేసిన మనుషులు మనల్ని వేలెత్తి చూపిస్తున్నట్లు, అర్దరాత్రి కలలో మన ఊరు పిలుస్తున్నట్లు,తిరిగి రాని బాల్యం జాతరలో దొరికే
చిలుకలు,బత్తీసలై మెల్ల మెల్లగా చప్పరిస్తుంటే తీయని
జ్ఞాపకమయినట్లు ఉంటుంది.అదే అనుభూతి తుల శ్రీనివాస్ కవిత్వం చదువుతుంటే కూడా కలుగుతుంది.ఊరు అమ్మ ప్రేమతో కలిపి పెట్టే గోరుముద్ద.ఊరు మన ఊరి వాడకట్టుల్లో  మనల్ని చేయి పట్టుకొని నడిపించిన నాన్న.ఊరు వెన్నెల రాత్రిలో  తాతయ్య చెప్పిన కథ. మొత్తంగా ఊరంటే తుల శ్రీనివాస్ కవిత్వం....
                           
కామెంట్‌లు