సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -423
ఇక్షు రస న్యాయము
*****
ఇక్షు అనగా చెఱకు.రస అంటే సారము, ద్రవము, నీరు, మద్యము,రుచి,రుచికల పదార్థము, అభిరుచి,,పాదరసము, విషము అనే అర్థాలు ఉన్నాయి.
యంత్రంలో పెట్టి గట్టిగా నొక్కితే గానీ చెఱకు గడ నుండి రసము వెలికి రాదు.
జ్ఞానమనేది చెఱకు గడ లాంటిది.దానిని  మరలో వేసి తిప్పినా, బాగా నలగ గొట్టినా, నుజ్జునుజ్జు చేసినా,వడితిప్పి పిప్పిగ చేసినా అందులోంచి తీయని జ్ఞానమనే రసం వస్తుంది కానీ అలా  ప్రయత్నించక పోతే రాదు అని అర్థము.
 అనగా చెఱకు గడ లాంటి జ్ఞానవంతులతో మాట్లాడినా,సాంగత్యం వలన ,మరే విధమైన చర్చ చేసినా వారి మేధోమథనం నుండి ఉద్భవించేది అపార సంపద లాంటి విజ్ఞానరసమే అనే అర్థంతో ఈ "ఇక్షు రస న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
పాలను బాగా కాగ బెడితే పైన తెట్టులాగా మీగడ ఏర్పడుతుంది. దానిని అలాగే వుంచితే అందులోంచి వెన్న నెయ్యి రావు.
ఆ పాలను తోడు పెట్టాలి. మంచిగా తోడుకున్న తర్వాత కవ్వంతో చిలకాలి.అప్పుడే  వెన్న వస్తుంది. వెన్న కాచితే నెయ్యి  వస్తుంది. పెరుగులో నీళ్ళు పోసి బాగా మధిస్తేనే వెన్న వస్తుందన్న మాట.
అలాగే చెఱకు గడలను ముక్కలు ముక్కలుగా కోసి వాటిని చెరకు మిషన్ లో వేసి గట్టిగా నొక్కితేనే చెఱకు రసం వస్తుంది.
పై పొరను తొలగించి లోపలి భాగం ముక్కలు చేసి ఇంట్లోని మిక్సీలో వేసి చేస్తే కూడా రసం వస్తుంది.
మన పెద్దలు చెఱకు రసాన్ని జ్ఞానంతో పోల్చారు కదా! మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందో చూద్దామా.
జ్ఞానం  అంటే ఏదైనా విషయాన్ని గురించిన అవగాహన సామర్ధ్యం.ఆచరణాత్మక నైపుణ్యం ,వాస్తవాల పరిజ్ఞానమని  చెప్పుకోవచ్చు.
కొందరు తమకు ఫలానా విషయాల గురించి సంపూర్ణమైన లేదా  మంచి అవగాహన వుంది అంటూ వుంటారు.ఆ అవగాహనే వారి జ్ఞానం.మరి అందరికీ జ్ఞానము ఒకే స్థాయిలో వుంటుందా? అంటే వుండదనే చెప్పాలి.వ్యక్తుల్లో  జ్ఞానము వివిధ స్థాయిలలో వుంటుంది.
జ్ఞానము అనుభవాల నుంచి కూడా వస్తుంది. అనుభవాల వల్ల కలిగే మేధోమథనం ద్వారా సంపాదించే జ్ఞానం విజయాలను సాధించడానికి వుపయోగపడుతుంది.
జ్ఞానం కలిగితే ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్కసారి జ్ఞానం పొందిన వారికి పునరావృత్తి కలుగదు.అంటే మళ్ళీ మళ్ళీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా  పొందిన జ్ఞానం ఉపయోగపడుతుందన్నమాట.
 చెఱకు గడను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తే దానిని గ్రహించే శక్తిని నైపుణ్యంగా చెప్పుకోవచ్చు.
నైపుణ్యం అనేది ఆచరణ ద్వారా వస్తుంది.ఆచరణతో కూడిన అనుభవంతో సంపాదించేదే  జ్ఞానమని ఈ "ఇక్షు రస న్యాయము" లోని అంతరార్థం.
అది తెలుసుకున్న మనం  ఆ దిశగా సాధన చేసి జ్ఞాన రసాన్ని పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు