రోడ్దు ప్రమాదాల నివారణకు చర్యలు;- సి.హెచ్.ప్రతాప్
 రహదారి ప్రమాదాలలో మన దేశం ప్రపంచ వ్యాప్తంగా 13 వ స్థానం లో నిలిచి బోలెడంత అప్రతిష్ట  మూటగట్టుకుంటోంది.
 కేంద్ర నౌకా, రవాణాయాన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గత 2005లో మొత్తం 1,29,994 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2004లో వీటి సంఖ్య 1,30,265గాను, 2003లో 1,27,834గా నమోదైనట్టు ఆ శాఖ నివేదిక వెల్లడించింది. అయితే.. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ‌హెచ్‌‍ఓ) సంస్థల నివేదిక ప్రకారం ప్రతి ఏడాది 1.2 మిలియన్ల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నట్టు వెలుగుచూసింది.
అలాగే.. మరో 50 మిలియన్ల మంది గాయాలు బారిన పడటం, శాశ్వత వికలాంగులుగా మారారు. ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువుగా 24 సంవత్సరాల లోపువారు కావడం గమనార్హం. అయితే మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య నాలుగింతలు పెరిగినట్టు అంచనా.ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ, రోజూ కొత్త వాహనాలు కూడా అదనంగా రోడ్ల పైకి చేరి ట్రాఫిక్ కిక్కిరిసి పోతున్నా రోడ్ల నిర్మాణం, నిర్వహణలో మాత్రం ఏం మార్పు ఉండటం లేదు.  రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఎన్నో విసృత పరిశోధనలను చేపట్టి రహదారుల నిర్మాణం లో కొత్త పోకడలను అనుసరిస్తుంటే, మన దేశం లో మాత్రం పాత చింతకాయ పచ్చడి పద్ధతులనే పట్టుకొని వేళ్లాడుతున్నాం. ప్రస్తుత ట్రాఫిక్ అవసరాలతో పాటు వచ్చే 20 సంవత్సరాలకు కావల్సిన వసతులకు అనుగుణం గా నిర్మాణాలను చేపట్టాల్సి వుండగా , మన దేశం లో రహదారుల నిర్మాణం ప్రస్తుత అవసరాలకు కూడా సరిపోకపోవడం  దురదృష్టకరం. ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన వారికి కూడా అత్యవసర వైద్యం అందించడం లో ప్రభుత్వాల వైఫల్యం ప్రస్పుటం గా కనిపిస్తొంది.మన దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు రోడ్లపై శ్రద్ధ పెట్టి రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దాలి. రోడ్లు విశాలంగా నిర్మించి ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలి. అంతేకాదు, ఇవి ఆ్రకమణలకు గురికాకుండా చూడాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలు విధించే పద్ధతి ఎలాంటి ఫలితాలనివ్వడం లేదు కాబట్టి అసలు నిబంధనలను ఉల్లంఘించే వీలు లేకూండా మెరుగైన శాస్త్రీయ పద్ధతులలో రహదారుల డిజైనింగ్ సాగాలి.

కామెంట్‌లు