అవసరార్ధం భగవద్ భక్తి-సి.హెచ్.ప్రతాప్

 కష్టాల కల్లోలం చుట్టుముట్టినప్పుడు
భగవంతుడు జ్ఞప్తికి వచ్చుట తీవ్రమైన వేదనతో
కష్ట నష్టములను దూరమొనర్చమని
కోరికల మూటతో ప్రార్ధన గావించడం,
అనంతరం భగవంతుడిని మరచుట మానవ నైజం
సుఖముల పానుపుపై తేలియాడే సమయమందు 
భగవంతుడిని జ్ఞప్తికి చేసుకోవడం బహు అరుదైన విషయం
స్వార్ధపు చింతనతో కోర్కెల మూటతో చేయు
ప్రార్ధనలు ఆ సర్వేశ్వరుడిని చేరలేవు
చిత్త శుద్ధి లేని శివ పూజ ఫలించదు
భగవంతుడిని కష్ట నష్టములను తీర్చెడి
యంత్రము వలే భావించే నేటి తరం మానవునికి
భక్తి, ముక్తి, మోక్షం అసాధ్యం
స్వార్ధం వున్న చోట భక్తికి లేదు స్థానం
అనుక్షణం భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చుకొని
ఆయన అనుగ్రహ ఫలం వర్షించని క్షణం
వ్యర్ధమని తలుస్తూ కష్ట సుఖములను  
ఆయన పవిత్ర ప్రసాదము గా భావించి
ఆనందం గా యధాతధముగా స్వీకరించడమే
నిస్వార్ధ , నిష్కల్మష భక్తుల తత్వం
రక్తి, విరక్తి అను నవి భక్తికి కారణములే
సుఖములలో మునిగి భగవంతుడిని విస్మరించుట ,
కష్టములు ఎదురైనప్పుడు నిందించుట కూడని పనులు,
ఈ పాపములకెన్నడూ నిష్కృతి లేదు  

కామెంట్‌లు