సుప్రభాత కవిత ;- బృంద
వసంతం నడిచొచ్చేదారిలో
రాలుటాకుల స్వాగతాలు
శిశిరం రాల్చిన ఆకుల స్థానే
కొత్తచివురుల జాతరలు

లోపమేదీ ఎంచనివ్వని
కానుకేదీ ఆశించని
కొత్తసొగసులు బహుమతిచ్చే
పండగంటి ప్రకృతి

కోరికలు తక్కువైతే
కొదవలే వుండవు
లేనిది ఆశించకపోతే
లేదని అనిపించదు

కోపాల స్థానే మన్నింపులు
అహాల స్థానే స్నేహాలు
అసూయల స్థానే అభినందనలు
అత్యాశ స్థానే సంతృప్తి

అలవాటైతే  అంతరంగానికి
శాంతిమయం జీవితాలు
సంస్కారపు ఆలోచనలే
అణచివేస్తాయి అహంకారాలు

అన్నీ తనవైనా అందరికీ పంచేసి
అదే తన సంతోషంగా మురిసిపోయే
అమ్మ మనసే ఆదర్శంగా
ప్రకృతిలో భాగమై పరవశిద్దాం

చేతనైన సాయంతో
పరులకోసం పాటుపడదాం
పలకరించి అభిమానంగా
పరిచయాలు పంచుకుందాం

పెంచితే పెరిగేదే తుంచితే తరిగేది
ప్రేమైనా పగైనా
పంచినా తరగక పెరిగేదే
ప్రేమైనా  స్నేహమైనా

మనకోసం కమ్మటి రేపును
తెచ్చే ఆత్మీయనేస్తం వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు