సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -400
అన్యోన్యాశ్రయ న్యాయము
*****
అన్యోన్య అనగా పరస్పరం.ఆశ్రయ అనగా అండ,ఆధారం,ఇల్లు అనే అర్థాలు ఉన్నాయి.
అన్యోన్యాశ్రయము అనగా ఒకదాని కొకటి ఆశ్రయం అవుట లేదా అండగా వుండుట, ఆధారపడుట  అని అర్థము.
 ఈ "అన్యోన్య ఆశ్రయం" గురించి చెప్పాలంటే ఇది చదవడానికి చిన్న వాక్యమే అయినా ప్రపంచం అంతా ఇందులో ఇమిడి ఉంది.
"అన్యోన్యాశ్రయము లేకుండా జీవితానికి అర్థం లేదు అంటాడు- ఎరిక్ ఎరిక్సన్ " 
పరస్పర ఆధారపడటం అనేది ప్రపంచంలోని ప్రాథమిక వాస్తవం.జీవావరణ శాస్త్రం నుండి ఖగోళ శాస్త్రాల వరకు కుటుంబం నుంచి దేశాల వరకూ పరస్పర ఆధారిత ప్రపంచంలో జీవిస్తోంది.
 అనగా దాంపత్యం, కుటుంబం మొదలుకొని సమాజము అందులోని వివిధ వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలతో సహా అనేక విషయాలు ఇందులో ఉన్నాయి.ఇది ఒక్క మనుషులకు మానవ సంబంధాలకే కాదు ప్రకృతి- పర్యావరణం, అడవి-వన్య ప్రాణులు మొదలైనవి అన్నీ అన్యోన్యాశ్రయ ధర్మంపై ఆధారపడి వున్నాయి.
 సమాజానికి కుటుంబమే ఆదర్శం.కుటుంబంపైనే సమాజం ఆధారపడి ఉంటుంది.సమాజం విలువలతో ఉన్నతంగా‌ భాసిల్లాలి అంటే అందులోని కుటుంబాలు  విలువలతో కూడిన జీవితం గడపాలి. వ్యక్తిత్వ వికాసం, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడబడేవి ఆయా కుటుంబాల వల్లనే.కాబట్టి కుటుంబాలు -సమాజం అన్యోన్యాశ్రయాలుగా చెప్పుకోవచ్చు.
 అంతే కాదు సమాజం సమస్త వృత్తుల, వ్యాపారాల సమాహారం. అవసరాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పదు.
 ప్రకృతి ప్రసాదించిన వనరులను పరస్పర ఆధారితాలైన ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది. అది లోపించడం వల్ల ప్రస్తుతం ఎలాంటి విపత్తులు సంభవించాయో మనందరికీ తెలిసిందే.
దేహంలోని అవయవాలన్నీ పరస్పరం కలిసి పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలడు. దేహం లాంటిదే కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం.
కాబట్టి ఈ న్యాయాన్ని సదా గమనంలో పెట్టుకుందాం .ఆచరణలో చూపిస్తూ మన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు