ఉన్నత విద్య ప్రక్షాళన దిశగా తొలి అడుగు; -సి.హెచ్.ప్రతాప్

 విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి కేంద్రం చూపుతున్న చొరవ అభినందనీయం.. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలూ ఆర్నెల్లలోగా ఖాళీలను భర్తీ చేయాలని , నిర్దేశిత గడువులోగా పోస్టులను భర్తీ చేసుకోని విద్యాసంస్థలు తననుంచి గ్రాంట్లు అందుకొనే అవకాశాన్ని కోల్పోతాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆదేశాలు జారీ చెయ్యడం అభినందనీయం. ఉన్నత విద్యాసంస్థల్లో తగినంతమంది ఆచార్యులు లేనందున అరకొర వసతులతో, కాంట్రాక్ట్ పద్ధతిన అధ్యాపకులతో తూ తూ మంత్రం చందాన విద్యాబోధన కానిస్తుండడం వలన విద్యా ప్రమాణాలు దారుణం గా దెబ్బతింటున్నాయి. 2018 వ సంవత్సరం లో ఒక అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచపు మొదటి 250 ఉత్తమ విద్యా సంస్థలలో భారతదేశానికి చెందిన ఒక్క విద్యా సంస్థ కుడా లేకపోవడం ఉన్నత విద్య పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజెస్తొంది. పరిశోధన పరం గా కుడా భారతీయ ఉన్నత విద్యా సంస్థలు మొదటి 300 స్థానాలలో  స్థానం సంపాదించుకోలేకపోయాయి. దేశం లో ఉన్నత విద్యా రంగం లో అర్హులైన ఉపాధ్యాయుల నియామకంతో పాటు పలు విప్లవాత్మక సంస్కరణలను తీసుకురావాల్సిన ఆవశ్యకతపై 2005 లోనే సుదీప్ ఘోష్ కమిటీ, 2009 లో ప్రొఫెసర్ యశ్ పాల్ కమిటీ, 2013 లో సుబ్రమణియన్ కమిటీలు చేసిన సిఫార్సులను గత యు పి ఏ ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం వలనే ఉన్నత విద్య భ్రష్టు పట్టిపోయిందన్నది నిర్వివాదాంశం. ఉన్నత విద్యారంగంలో ఆచార్యుల కొరతను తీర్చడానికి యూజీసీ ఇంతటి విస్పష్టమైన ప్రణాళికను ప్రకటించి, దానిని విధిగా అనుసరించాలంటూ ఆదేశించడం ఇదే మొదటిసారి. గత 30 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. దీని వెనుక ఉన్నత విద్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవే ప్రధాన కారణం. అయితే గతం లో పలు ఉన్నత విద్యా సంస్థలలో అధ్యాపకుల నియామకం లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకొని చివరకు యు జి సి ఆ నియామకాలను రద్దు చేయాల్సి రావడం జరిగు నేపధ్యం లో ప్రస్తుత నియామకాలు పూర్తి పారదర్శకంగా, నియమ నిబంధనలకు అనుగుణం గా సాగేలా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
కామెంట్‌లు