సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -431
ఏరండ బీజ న్యాయము
*****
ఏరండము అనగా ఆముదపు చెట్టు.బీజము అనగా విత్తనము, మూలము అనే అర్థాలు ఉన్నాయి.
ఎండిన కాడ నుండి విడదీసిన ఆముదపు గింజ నీటి తడి తగలగానే చిట్లిపోయి చటుక్కున పైకి ఎగురుతుందనీ,అలాగే మరణమనేది దేహానికి తగలగానే అప్పటి వరకు దేహంలో ఉన్న ఊపిరి పైకి ఎగిరి పోతుందనే అర్థంతో ఈ "ఏరండ బీజ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 చిన్న చిన్న విత్తనాలతో కూడిన చెట్లు వాటి కంకులు ఎండినప్పుడు నీటి చినుకుల తడి తగలగానే చిట్లిపోయి విత్తనాలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడం. సమయం వచ్చినప్పుడు అవి మొక్కలుగా మొలవడం మనందరికీ తెలిసిందే.
 ఆముదపు చెట్టు గింజలు కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ, ఎండిపోయిన వాటికి తడి తగిల్తే మాత్రం ఫట్ మని విచ్చుకుని గింజలు ఎగరడం గమనించ వచ్చు.
 ఎలాగూ ఏరండము గురించి చెప్పుకుంటున్నాం కనుక దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందామా...
 "ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం" అని కొంత వ్యంగ్యంగా అనడం మనం తరచూ వింటుంటాం.
 అనే వాళ్ళు పరిహాసంగా అన్నప్పటికీ అది మొత్తంగా మేలు చేసే వృక్షమే.ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన చెట్టు.
ఈ చెట్టు ఎటువంటి నేలలోనైనా మొలుస్తుంది.దీని ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లు...అన్నీ వివిధ రకాల అనారోగ్యాల నివారణకు ఔషధంగా ఉపయోగపడేవే. మర్రి చెట్టులా విస్తరించి పెరగక పోయినా ఇది తగిన ఎత్తులో ఉంటుంది.దీని ఆకులు తలెత్తుకున్నట్లుగా చేతి వేళ్ళ ఆకారంలో పైకి  చూస్తున్నట్లుగా వుంటాయి.
విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో ఆముదపు నూనె దీపాలు వెలిగించే వారు.ఈ నూనె  విరేచనకారి.కానీ అది చేదుగా ఒకలాంటి వాసనతో వుండటం వల్ల దానిని తీసుకునేటప్పుడు ఎవరైనా సరే మొఖం చిట్లించి ఒకలా పెడుతూ వుంటారు.అలా పెట్టిన ముఖాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ సామెత పుట్టుకొచ్చింది.అదే "ఆముదం తాగిన ముఖం."
ఇక విషయం లోకి వద్దాము.ఈ ప్రపంచంలో జీవమున్న ప్రతి జీవీ మరణించక తప్పదు. బంధాలకూ, అనుబంధాలకు దూరంగా వెళ్ళిపోక తప్పదు.అందుకు చెట్లూ, వాటి విత్తనాలూ మినహాయింపు కాదు.
ఇక్కడ ఆముదపు విత్తనాన్నే ఉదాహరణగా తీసుకోవడానికి కారణం ఏమిటంటే ..అప్పటి వరకు చెట్టు కొమ్మను, కవచం వంటి పొరను అంటి పెట్టుకొన్న గింజ  తడి తగిలిన వెంటనే రెప్పపాటులో దాని నుండి విడిపోయి పైకి ఎగురుతుంది.
ఇలా ఈ ఆముదపు చెట్టు గింజను గమనించిన మన పెద్దలు చెప్పిన ఈ "ఏరండ బీజ న్యాయము"లోని అంతరార్థం గ్రహిద్దాం.
"కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం-రెప్పపాటే ఈ ప్రయాణం" అన్న ఓ కవి మాటలు  ఈ న్యాయానికి దగ్గరగా ఉన్నాయి.వాటిని గమనంలో పెట్టుకొని ఈ చిన్న జీవితానికి ఓ సార్థకత చేకూరేలా బతుకుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు