ఓ పరమాత్మా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పిలిచినా
పలుకవేమి
పరంధామా!

చెంతకురమ్మన్నా
చేరవేమి
చిదాత్మా!

అడిగినా
అగుపించవేమి
అంతర్యామీ!

కోరినకోర్కెలు
తీర్చవేమి
కరుణాకరా!

కావుమన్నా
కరుణించవేమి
కరుణామయా!

వేడుకున్నా
వరాలివ్వవేమి
విశ్వపా!

దుష్టులను
దండించవేమి
దైవమా!

అవినీతిపరులను
అంతమొందించవేమి
అధిభూతమా!

ఆపన్నులను
రక్షించవేమి
అంతరాత్మా!

వ్యాధులనుండి
విమోచనకలిగించవేమి
విశ్వతోముఖా!

కడుపుకాలుతున్నవారికి
కూడివ్వవేమి
కాయస్థా!

ఎప్పుడో
కనపడ్డావు
మాటిచ్చావు

యమభటులబాధ
ఉండదని
సెలవిచ్చావు

అనారోగ్యము
దరిచేరదని
నమ్మపలికావు

కోరినపుడువచ్చి
వెంటతీసుకెళ్తానని
వాగ్దానంచేశావు

తిరిగి
తొంగిచూడలేదు
తడవెంతగడిచినా!

అలసితి
సొలసితి
ఆదిమధ్యాంతరహితా!

నేనుచేసిన
నేరమేమి
నిరంజనా!

ఆవేదన
అర్ధంచేసుకో
అజరామరా!

ఇకనైనారావా
ఇడుములనుండిమోక్షమివ్వవా
ఈశ్వరా!

కామెంట్‌లు