సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-429
ఏకదేశ వికృత న్యాయము
****
ఏక దేశము అనగా అంశము, భాగము. వికృత అనగా మారినది, వికారముపొందినది, రోగము గలది,రోతయైనది అనే అర్థాలు ఉన్నాయి.
ఒక భాగము వికారము ఐనప్పటికీ మరొకటి కాదన్నట్లు.
అనగా ఒక భాగము లేదా అవయవము వికారంగా  ఉన్నంత మాత్రాన మొత్తంగా వికారమైనదని అనకూడదనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 మనుషులలో కొందరు చూడగానే చటుక్కున అందంగా కనిపించక పోయినా, ఇదేంటి ఇలా ఉన్నారేంటి అనిపించి  వారిని  తక్కువ చేసి మాట్లాడకూడదు.
ఎవరిలోనైనా కొంచెం తరచి చూస్తే బోలెడు అందాలు కనిపిస్తాయి. 
కొందరికి ముక్కందం, మరికొందరికి కళ్ళందం.‌.. కాబట్టి అవయవ పొందిక అందంగా ఉన్నా లేకపోయినా  మొత్తానికీ కలిపి వికారమనే నిర్ణయానికి రాకూడదు అంటారు మన పెద్దలు.
కొందరు వ్యక్తులు చూడటానికి బాగా లేకపోయినా ఉన్నతమైన వ్యక్తిత్వం,విద్యా ,విజ్ఞాన సంపద కలిగి వుంటారు.
 అలాంటి వారిని ఉద్దేశించి భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా...
పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్/దూరములైన వాని యెడ దొడ్డగ జూతురు బుద్ధిమంతు లె/ట్లారయ గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ/ర్జూర ఫలంబ్రియము చొప్పడ లెకులుగొంట భాస్కరా!"
అనగా ఖర్జూరము పైకి ముడతలతో వున్నా మంచి రుచిగా వుండటం వల్ల అందరు కొనుక్కుని తింటారు.కురూపి యైనను గుణవంతుని ప్రజలు ఖర్జూరమును ఆదరించినట్లే ఆదరిస్తారు" అని అర్థము.
 దేహంలోని ఏదో ఒక భాగం వైకల్యం ఉన్నా ఫరవాలేదు కానీ మానసిక వైకల్యం వుండకూడదు.
మానసిక వైకల్యం అంటే ఇక్కడ  చెప్పేది పుట్టుకతోనే మందబుద్ధిగా ,ప్రజ్ఞ తక్కువగా ఉన్న వారి గురించి కాదు.
కొందరిలో స్వార్థం, దుర్మార్గం, దుష్టత్వం లాంటి అనేక చెడు గుణాలు పోత పోసి ఉంటాయి.అలాంటి వాటన్నింటినీ కలిపి మానసిక వైకల్యం అనవచ్చు.అలాంటివి ఉండకూడదని నా భావన.
 ఈ సందర్భంగా గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారు రాసిన పద్యాన్ని కూడా చూద్దాం.
"గరమున్ మ్రింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీ యాత్మలో/ మురియంబోకు మనుష్య దుర్విషమునున్మూలింపుమా ముందు యీ/నరులందుండు విషమ్ము సూది నిడనైన స్సంధి లేదో ప్రభూ/ హర శ్రీ వేములవాడ రాజ ఫణిహారా! రాజ రాజేశ్వరా!"
అనగా విషాన్ని మింగి దేవతల దుఃఖాన్ని హరించినానని నీలో నీవు మురిసిపోకు.మనుషుల్లో సూది మొనకు కూడా తావు లేనంతగా విషం నిండి పోయింది.ఆ మనుషుల్లోని భయంకరమైన విషాన్ని ముందు తొలగించు రాజరాజేశ్వరా! అంటాడు.
అదిగో అలాంటి వారే అసలైన వికారం గలిగిన మనుషులు.
 కాబట్టి "ఏక దేశ వికృత న్యాయము"ద్వారా శరీరంలో ఏదో ఒక భాగం వికారంగా ఉందని,మనిషి మొత్తాన్ని కలిపి వికారి అనకూడదనే  నీతిని మనం గ్రహించగలిగాం.
వికారాలు, వైకల్యాలు ఉన్న వ్యక్తులు ,ఏ వికారాలు లేని వారి కంటే ఎన్నో అద్భుతాలు, గొప్ప పనులు చేసి రాణించిన వారు మన చుట్టూ ఉన్న సమాజంలో  వివిధ రంగాలలో ఎందరో ఉన్నారు.అలాంటి వారిని గౌరవిద్దాం. సమాజానికి పరిచయం చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు