ప్రసాదం ప్రాశస్థ్యం- సి.హెచ్.ప్రతాప్
భగవంతుని మహిమలతో మనసు నింపు కోవటం,భగవంతుని లీలలు, తత్వంతో చింతన సదా చెస్తూ వుండదం , భగవత్‌ తత్వం అలకించడం, భగవత్‌ తత్వం గురిం చి ఆలోచన చేయడమూ, అనుభవానికి తెచ్చుకోవ డం, ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, నడ వాలనే ఆసక్తి కలగటం, నడవ గలగటం ప్రసాదం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రసాదం అంటేనే స్వచ్ఛత అని అర్థం. భక్తితో రోజువారీ పూజలు చేస్తూ భగవంతుడిని దర్శనం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుంది. భగవంతునికి సమర్పించే నైవేద్యం ప్రసాదంగా మారుతుంది. దానిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.


ఏ పదార్థాన్నైనా శుచిగా, పవిత్రమైన మనస్సుతో వండి, భగవంతుడికి నివేదన చేసి, నైవేద్యంగా అర్పణ చేస్తే, అది పవిత్రతను ఆపాదించుకుని, దైవ ప్రసాదంగా మారుతుంది. ఎంత పనిలో ఉన్నా ప్రసాదం అనగానే, ప్రతి ఒక్కరూ భక్తితో పరవశించి పోతారు. ఎంత వారైనా, ఎంతటి వారైనా, భక్తితో రెండు చేతులు చాచి విన మ్రంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు.అన్నం వండేవారే ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని స్వీకరించేవారి మీద  కూడా  ప్రభావం చూపుతుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని చూడకుండా పెడతారు.హృదయానికి సంతోషం కలిగించేదాన్ని ‘ప్రసాదకం’ అని అంటారు. మనం రోజూ ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా.. ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది.  
ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది. మనిషిలోని కరుణను పెంచుతుంది. ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది.  అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటం వల్లనే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.అదే ప్రసాదం లో వున్న మహత్యం .సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు.. తాను ఇష్టపడే ఆహారం ప్రసాదంగా లభిస్తుందని ఎవరూ అనుకోరు. ఆలయంలో ఏమి ఇస్తున్నారో దానిని ప్రసాదంగా, భక్తితో అంగీకరిస్తాం. అదే విధంగా జీవితంలో భగవంతుడు మనకు ఇచ్చిన ప్రతిదానిని కృతజ్ఞతతో, భక్తితో స్వీకరించి జీవించాలి.
 వంట చేసేవారు ప్రతీరోజూ అన్నపూర్ణాష్టకం చదివితే తాము చేసిన వంటకు ఫలితం లభిస్తుంది. ఎంత మంది ఆ ఆహారాన్ని తిని ఆనందంగా ఉంటారో వీరికి తెలియకుండా అంత ఎక్కువ స్థాయిలో పుణ్యం సంపాదించుకుంటారు.భగవంతుని ప్రసాదం తినడం వల్ల మనస్సు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రసాదం సాధారణంగా ఇతర ఆహారాల కంటే తక్కువగా తింటారు, కానీ అది మనకు రెట్టింపు సంతృప్తిని ఇస్తుంది. ప్రసాదం తీసుకోవడం వల్ల మనసులో , మెదడులో సానుకూల భావోద్వేగాలు ఏర్పడతాయి. భగవంతుడికి సమర్పించే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది.
కామెంట్‌లు