శారిక తీరిక చేసుకుని
రతిపతి వెంటదిరిగి సవ్యముగ
దక్షత నేర్చుకుని దరహాసము చేసి
ధాత్రి జయించిన గర్వముతో
తనురుహము లల్లార్చి
సిస్తు చూసుకుని మిగుల
రిక్కించి పైకెగిరి మిగుల
చతురిమతో చపలముతో సంచరించి
క్రితము నేర్చినదంతయు వ్యర్థముగాగ
భద్రత మరిచి భంభరము వలె
వాయువేగాన వారివాహము తాకునట్లుగా
నికామముగా తిరిగి తిరిగి
పువ్విలుకాని సమము నేనంటూ స్వీయ
నుతి చేసుకున్నది సంతోషము
గుబ్బతిల్లగా ఎగిరి ఒక గుయ్యారము జొచ్చి
తాపనుని గానక చీకటినబడి
లుఠనము పొంది గిలగిలలాడి ఏడ్చిన
పులుగు ధరణినిబడి చనిపోయె సుమా!!
{శారిక=గోరువంక;రతిపతి=మన్మథుడు;
దక్షత=నేర్పు;ధాత్రి=భూమి;తనూరుహము=రెక్క;
సిస్తు=అందము;రిక్కించి=నిక్కించు,నీల్గు;
చతురిమ=నేర్పరితనము,నైపుణ్యము;
చపలము=నిలకడలేనితనము; క్రితము=పూర్వము; భంభరము=జోరీగ;వారివాహము=మేఘము;
నికామము=యథేఛ్ఛగా;పువ్విలుకాడు=మన్మథుడు;
నుతి=పొగడ్త;గుబ్బతిల్లగా=అతిశయించు;
గుయ్యారము=చీకటిగుహ;తాపనుడు=సూర్యుడు;
లుఠనము=దొర్లుట;పులుగు=పక్షి}
**************************************
పులుగు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి