సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -452
కారణగుణ ప్రక్రమ న్యాయము
****
కారణ అనగా హేతువు, తర్కము, ఆధారము, పనిముట్టు, సాధనము, ఉద్దేశము , పనిముట్టు, పని ,పధము, తండ్రి అనే అర్థాలు ఉన్నాయి.
గుణ అనగా గుణము ( మంచి లేక చెడ్డది)ఒక సద్గుణము, ఉపయోగము,ఫలము,త్రాడు,అల్లెత్రాడు,వీణ యందలి తీగె,ఆవృత్తి, గొప్పదనము,3 అనే సంఖ్య అనే అర్థాలు ఉన్నాయి.
ఇక ప్రక్రమ అనగా  ప్రారంభము.
కారణము ఎట్టి గుణము కలిగి వుంటుందో కార్యము కూడా అట్టి గుణాలతో కనిపిస్తుందని, ప్రారంభించిన పనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 గుణాలను బట్టి కారణాలు.కారణాలను బట్టి కార్యాలు, కార్యాలను బట్టి ఫలితాలు వుంటాయనేది ఈ న్యాయము ద్వారా గ్రహించవచ్చు.ఇక వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
 కారణం అంటే హేతువు.మానవుడు చేసే పనులన్నీ కారణంతో ముడిపడి వుంటాయనేది మనందరికీ తెలిసిందే.అలా ముడిపడిన పనులు కొన్ని గుణాలను అనగా  లక్షణాలను కలిగి ఉంటాయి.
అలాగే ఈ గుణాలు పదార్థంతో విడదీయరాని సారూప్యత కలిగి వుంటాయి.
మానవుని దేహం ఓ కారణం అయితే ఆ కారణానికి 1.శరీర గుణాలు ( భౌతిక లక్షణాలు) 2.సామాన్య గుణాలు (సాధారణ లక్షణాలు).3.ఆధ్యాత్మిక గుణాలు ( ఆధ్యాత్మిక లక్షణాలు)4. ఇంద్రియార్థ విశిష్ట గుణాలు ( ఇంద్రియాలకు సంబంధించిన వస్తువుల లక్షణాలు) మొదలైనవి వుంటాయి.
దేనిపట్లనైనా ఆకర్షితులు అయ్యేది గుణము చేతనే.చూడగానే ఆకర్షింపబడేది గుణమే.ఆయా గుణాల కారణంగా  పనుల పట్ల వ్యక్తులు ఆకర్షితులు అవుతుంటారు.
చూపులకు ఆకర్షణీయంగా కనబడటం. మాట తీరు, వ్యవహారం ఇవన్నీ  భౌతిక గుణాల కిందకు వస్తాయి.
సామాన్య గుణాలు అనేవి పంచేంద్రియాలకు సంబంధించిన గుణాలు..ఇవి అందరిలో సర్వసాధారణంగా సారూప్యత కలిగి ఉంటాయి.
ఇక ఆధ్యాత్మిక గుణాలనేవి ఆత్మకు సంబంధించిన గుణాలు.ఇందులో కోరిక, ద్వేషం, సుఖము,దుఃఖము, కృషి, బుద్ధి మొదలైనవి వుంటాయి.
కారణాలు,గుణాల గురించి తెలుసుకున్నాం కదా! ఇందులో మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే... ఇక్కడ మనం మనిషిని ఒక  వస్తువు అనుకున్నట్లయితే.... మనుషులంతా వివిధ వస్తువులు.ఏ వస్తువుకు ఆ వస్తువే ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటుందన్న మాట.
 ఏ వస్తువుకు ఆ వస్తువు ప్రత్యేకం అయినట్లే మనుషుల్లో కూడా మూడు రకాల గుణాల వల్ల, మూడు రకాల భిన్న ప్రత్యేకతలను కలిగి ఉంటారు. అవే సత్వ, రజో, తమో గుణాలు.
అలాంటి గుణాలను బట్టి వారి జీవన విధానం ప్రారంభం అవుతుంది.
 మరి ఆ గుణాలు కలవారు ఎలా వుంటారో చూద్దాం.సత్వ గుణంతో నిండిన వ్యక్తి స్వచ్ఛత,పవిత్రత, భక్తి, ప్రశాంతత, ప్రేమ,కరుణ, మృదు భాషణం, ఇంద్రియ నిగ్రహము కలిగి వుంటాడు.
రజో గుణం కల వ్యక్తిలో చురుకుదనంతో పాటు గాంభీర్యం, తొందరపాటు, నాయకత్వ కోరిక, ఆధిపత్యం, స్వీయ ప్రచారం, నియమాలను ఉల్లంఘించడం, ఖర్చులు మరియు ఆడంబరాల పట్ల ప్రేమ, దురాశ, గర్వం మొదలైన గుణాలు కలిగి వుంటాడు.
ఇక చివరిది మూడవది అయిన తమోగుణం ఇది సోమరి తనం మరియు జడత్వం కలిగి ఉంటుంది.
ఇలాంటి  వ్యక్తి సోమరితనం, బద్ధకం, నీరసం, పగటి కలలు కనడం, ఈర్ష్య అసూయలు,లోభత్వం, దొంగతనం, ద్రోహం,పగ, వ్యామోహం నిజాయితీ లేకపోవడం, వెన్నుపోటు  లాంటి గుణాలు కలిగి వుంటాడు.
ఈ మూడు రకాల గుణాలను ప్రారంభం నుండే పసిగట్ట వచ్చు.కొందరికి పుట్టుకతోనే ఈ గుణాలు వస్తాయి.మరికొందరికి పరిస్థితుల ప్రభావం వల్ల సంక్రమిస్తాయి.
ఈ విధంగా వ్యక్తి యొక్క మనో దేహ సంబంధ కారణాల వల్ల  వివిధ కార్యాలను చేస్తూ ఉంటాడు.ఇలా "కారణ గుణ ప్రక్రమ" ప్రకారం సమాజంలో మనిషి ఆయా వ్యక్తిత్వం గల వ్యక్తిగా గుర్తింపబడతాడు.
 ఇదండీ "కారణ గుణ ప్రక్రమ న్యాయమంటే".
 మరి ఇవన్నీ చదివిన మనం ఎలా వుండాలో ఏ గుణాలను పెంపొందించుకోవాలో? ఏ గుణాలను విడిచి పెట్టాలో తెలిసింది కదా! మన వ్యక్తిత్వం మనల్ని సమాజానికి చూపించే అద్దం లాంటిది.కాబట్టి సత్వ గుణంతో స్వయం ప్రకాశకులమై సమాజంలో శాంతి సహన వెలుగులు నింపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts