వర్షధార (పోటీ నిమిత్తం వ్రాసినవి);- మమత ఐల-కరీంనగర్-9247593432
తే.గీ పద్యాలు
--------------------
ధరణి యందునన్ వానలు దండిగాను
కురియ పచ్చనిపంటకు కొదవలేదు
వరద వంకలై సాగంగ కరువు లేని
సాగు నీరెల్ల పొందేము చక్కగాను

వృక్ష సంపదల్ పెంచంగ విరివిగాను 
జనులకారోగ్యమొనగూరి జయముగలుగు
వరుణ దేవుండు జూపెడి కరుణతోడ 
ప్రాణవాయువున్ తరువులు పంచునెపుడు

పుడమి వర్షంబు చినుకుతో పులకరించ
పంట చేలంత పెరిగేను పచ్చగాను
దైవ కృపతోడ పండెడి ధాన్యరాశి
జగతి నంతటిన్ బ్రతికించు చలువతోడ

కుంభ వర్షంబు కురియగన్ కుంటలన్ని
నిండి పృథ్విలోనింకగా నిలువగాద
భూమి తేమతో సమమౌచు దామమల్లె
బోరు బావుల్లో నూటలై పారుగాద

భారతమ్మకు మెడలోన భాగ్యమైన
పచ్చల పథకంబు విధము పైరులెదిగి
ధాన్యలక్ష్మితో విలసిల్ల దారిజూపఁ
వర్షధారలే ఘనమైన వనరులగును

కామెంట్‌లు