అందమైన జీవితం; -ఉదండ్రావు రమణబాబు
కుసుమ ధర్మన్న‌‌‌ కళాపీఠం 
======================
అలంకరణతో వచ్చేది కృత్రిమ అందం 
అంతరంగపు లోతుల్లో స్వచ్ఛత నిండి ఉంటే 
అది ఆనందవదనమై ప్రతిబింబిస్తుంది 
అంతః సౌందర్యం లేని బాహ్యసౌందర్యమేల 
అందమే ఆనందం కావాలంటే 
నీ నవ్వులో కల్తీకి చోటివ్వకు 

జీవితం బుద్భుదమని తెలిసినా
అందని వాటి కోసం నింగికి నిచ్చెనలేల
అంతులేని ఆవేశంతో విచక్షణ మరచి 
రసమయ జీవితం లో నిప్పులు పోసుకోనేల 
బ్రేకులు లేని కాలచక్రానికి ఎదురెల్లి 
చేజేతులా కొరివితో తల గోకుకొనుటేల 

మదిలో ఆలోచనలు మధురమైతే 
కాలకూట విషం నిన్నేమి చేస్తుంది 
అసూయా ద్వేషాలు వీడనాడి
ధృక్కులలో మంచిని నింపి నలుదిక్కులా 
శాంతి సమీరాలను వ్యాపింప చెయ్యు

ఉచితానుచితాల జ్ఞానమే ఉద్దీపించగా 
పరోపకారమే పరమావధిగా
జన్మకు ‌సార్దకత చేకూర్చుకుంటే
బ్రతుకు అమృత తుల్యం కాదా?
ఆనందాబుధిలో మది ఓలలాడదా

కామెంట్‌లు