సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -480
గర్తస్థ మృత సర్ప న్యాయము
*****
గర్త అనగా గుంట, గోయి, ఒకానొక రోగము.అస్థ/అస్త అనగా విడువ బడిన, విసరి వేయబడిన, పూర్తి చేయబడిన. మృత  అనగా మరణించినది,వ్యర్థమైనది, చావు,బిచ్చమెత్తుకొను వృత్తి. సర్ప అనగా పాము అని అర్థము.
కన్నంలో పడి చచ్చిపోయిన పాము ఆ కన్నమందే  లీనమై యున్నట్టు ..
అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి జీవి ఇక్కడే పుట్టి పెరిగి మరణించి ఈ సృష్టిలో కలిసిపోతుంది  అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "గర్తస్థ మృత సర్ప న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
పాము కన్నంలో ఇరుక్కుని అక్కడే చనిపోయి,ఆ తర్వాత ఎండిపోయి తర్వాత  పంచ భూతాలలో ఒకటైన ఈ భూమిలో కలిసిపోతుంది.
మరిలా జరిగేది ఒక్క పాముకేనా? మరే ఇతర పశు పక్ష్యాదులకు కాదా? అనే ప్రశ్నలకు సమాధానం అన్నింటికీ అదే వర్తిస్తుందనే జవాబు వస్తుంది.ఇక్కడ  కేవలం ఉదాహరణగా పాముని తీసుకున్నారు.అంతే తప్ప మిగతావి దానికి అతీతమని కాదు.
సృష్టి స్థితి లయలకు అతీతంగా ఏ ప్రాణులు  వుండవు.
సృష్టి అంటే పుట్టుక.స్థితి అంటే పెరుగుట,ఉండుట.లయ అంటే కలిసి పోవడం.అంతే కానీ నశించడం కాదు అంటారు ఆధ్యాత్మిక వాదులు.
ఇక పురాణాలు ఇతిహాసాలు కూడా దేహము పంచభూతాల నిర్మితము కాబట్టి తిరిగి పంచభూతములలో లీనమవడాన్ని లయ స్థితిగా  పేర్కొన్నారు.
సృష్టి తర్వాత స్థితి అనేది అనేక రూపాలు మరియు గుణాలను కలిగి వున్న ఒక వాస్తవిక ప్రపంచాన్ని సూచిస్తుంది.
ఇలా సృష్టి స్థితి లయ కారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని హిందువుల నమ్మకము.
అలా ఆధ్యాత్మిక దృష్టితో చూసినా చూడకున్నా  మనం ఈ చైతన్య ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు బంధువులా?స్నేహితులా? కుటుంబ సభ్యులా? వీరే కాదు మన కళ్ళముందు పశు పక్ష్యాదులు కూడా పుట్టడం పెరగడం , ఆ తర్వాత ఈ ప్రకృతిలో లీనమై పోవడం కనిపిస్తుంది.
అది మనిషిలో తాత్కాలిక లేదా శాశ్వతమైన  ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది .జీవితం ఇలా ఉంటుందనీ, దానికి మానసికంగా సిద్ధపడాలనే ఓ సందేశం ఇస్తుంది.
ఇక్కడ "గర్తస్త మృత సర్ప న్యాయము" ను చూసినట్లయితే  పామూ మనకు కనబడదు అది చనిపోయింది ప్రత్యక్షంగా చూడము.కాని  దాని అవశేషాలు మన దృష్టిలోకి వచ్చినప్పుడు  మనలో ఈ విధంగా ఓ ఆధ్యాత్మిక భావన పెల్లుబుకుతుంది.
ఇలా ఈ లోకంలో ప్రతిరోజూ ప్రతి క్షణం సృష్టి స్థితి లయలు ఆగకుండా జరుగుతూనే ఉంటాయనే ఆత్మ జ్ఞానం కలుగుతుంది.
ఇదండీ! గార్హస్త మృత సర్ప న్యాయములో యిమిడి వున్న అసలైన అంతరార్థం. పాముని ఓ సాకుగా చూపి ఇక్కడ మనకు అర్థం అయ్యేలా చెప్పడం జరిగింది.
 ఈ న్యాయాన్ని ఆకలింపు చేసుకుని  సృష్టి లయల మధ్య గల స్థితిని ఫలవంతం చేసుకుందాం. అప్పుడే పెద్దలు చెప్పిన చద్ది మూట లాంటి ఈ న్యాయానికి న్యాయము జరుగుతుంది.

కామెంట్‌లు