తస్మాత్ జాగ్రత! జాగ్రత! [ ఆధ్యాత్మిక తత్త్వోపదేశము ] ; - విద్వాన్ పైడి హరనాథ రావు.,
    ఆట వెలది పద్యములు
    ==================   
  తల్లి, తండ్రి, సుతులు, ధన మన్నదమ్ములు
  జగతి సతియు, బంధు జనులు మిధ్య
   సావధాను లయ్యు సత్య మెఱుంగుడు
   సుజనులార! యివియె నిజము కావు!                         (2)   
  జన్మ జరయు, సుతులు సతియు, దుఃఖంబులు
  కలుగజేయు చుండు, కాంచ భువిని
  మరల మరల తిరిగి, మానవులను జేరు
  సుజనులార! యివియె నిజము కావు!
                      (3)
    కామ క్రోధ లోభ, మా మోహమాదులు
    నంతరంగ శత్రు లారుగురు
   "జ్ఞాన"మనెడు రత్న చయమును దోచును
    విడువవలెను వీని, విజ్ఞులార! 
                    (4)    
    కట్టుబడియు నాశ కర్మల బద్దులై
    గమ్య మెఱుగ లేక గడుపు జనులు
    నందు చిక్కి బ్రతుక నాయువు క్షీణమౌ
   సుజనులార! యిదియె నిజము  సుమ్ము! 
                    (5)  
   శాశ్వతములు కావు సంపద లన్నియు
  యౌవనంబు సమము పూవుతోడ
  మెరుపు తీగ వలెను మెరయు నాయుస్సది
  సుజనులార! యిదియె నిజము సుమ్ము!
                    (6)        
  ధనము బుద్ధి బ్రతుకు, క్షణ భంగురంబులు
  యముడు ప్రాణ హరుడు, సమము జేయు
  దయను జూప డతడు తగ వేచి యుండును
   సుజనులార! యిదియె నిజము సుమ్ము!     
          🚩తస్మాత్ జాగ్రత! జాగ్రత!
కామెంట్‌లు