సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -481
ఘటారోహణ న్యాయము
*****
ఘటము అంటే  మట్టితో కుండ, కూజా,నీరు పోసుకునే పాత్ర, ఏనుగు కుంభ స్థలం,, ఉచ్ఛ్వాస నిశ్వాసములను నిలుపు చేయుట, ఇరువది ద్రోణముల పరిమాణము.ఆరోహణ అనగా ఎక్కుట, నిచ్చెన,మొలక అనే అర్థాలు ఉన్నాయి.
అభ్యాసం చేసినట్లయితే కుండ పగిలిపోకుండా కుండపై ఎక్కవచ్చును అని అర్థము..
"అభ్యాసం కూసు విద్య అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "ఘటారోహణ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఘటారోహణ అనేది ఎంతో అభ్యాసం, సాధన చేస్తేనే గాని సాధ్యపడదు.
ఈ ఘటారోహణ నృత్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మన భారత దేశంలోని త్రిపుర జానపద నృత్యాలలో రియాంగ్ తెగకు చెందిన మహిళలు "హోజాగిరి" అనే నృత్యం చేస్తారు.వీరు ఈ నృత్యాన్ని సాధారణంగా కొత్త పంట వచ్చే సమయంలో చేస్తారు. వారు లక్ష్మీ దేవిని పూజిస్తారు.ఆ  సందర్భంగా చేసే నృత్యం  చూసేవారికి ఉత్కంఠను కలిగిస్తుంది.
ఈ నృత్యం పేరు హోజాగిరి. హోజాగిరి అనగా సమతుల్యత, అంకిత భావం, సూక్ష్మ నైపుణ్యం కలిగిన నృత్యం.
ఈ నృత్యంలో నర్తకి తలపై సీసాతో మట్టి కుండ మీద నిలబడి వుంటుంది. వెలుగుతున్న దీపం సీసాపై వుంటుంది. సీసా కింద పడకుండా దీపం మలగకుండా కుండ మీద నిలబడి క్రింది శరీర భాగాలను లయబద్ధంగా వంగి కదుపుతారు.చేతుల కదలిక లేదా శరీరం యొక్క పై భాగం కొంత వరకు పరిమితం చేయబడినా నడుము నుండి పాదాల వరకు కదలిక అద్భుతమైన అలలను సృష్టిస్తుంది. ఆ అద్భుతమైన నాట్యం కనులకు విందు చేస్తుంది.
 అలాగే కూచిపూడి నృత్యంలో నెత్తిమీద చెంబూ, కాళ్ళ క్రింద పళ్ళెము  పెట్టుకొని నృత్యం చేసినట్లుగా యాదవుల కళా రూపాల్లో  కూడా  ఇలాంటిదే ఒకటుంది.అదే తప్పెట గుళ్ళ నృత్యం. ఇది కూడా పై విధంగా కుండ మీద నృత్యం చేస్తారు.
ఈ నృత్యంలో వీరు నీళ్ళు నిండిన మట్టి కుండ అంచులపై ఒకరు నిలబడితే,అతనిపై మరో కళాకారుడు తప్పెటను వాయిస్తూనే నీళ్ళు నిండిన కుండను నెత్తి మీద పెట్టుకొని నీళ్ళు తొణకకుండా,మరో పక్క తప్పెట వాయిస్తూ నృత్యం  చేస్తాడు. ఇది చూసే వారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.మనసులో ఎంత గొప్ప సాధన అనుకోకుండా వుండలేం.
 ఇలాంటి  నృత్యాలు చేయడం చేయడం అనేది మామూలు విషయం కాదు.ఎంతో సాధన చేస్తేనే  తప్ప పట్టుబడే విద్య కాదు.
 'అందుకే వేమన ఓ పద్యంలో ఇలా అంటాడు.
"అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు/ తినగ తినగ వేము తియ్యనుండు/సాధనమున పనులు సమకూరు ధరలోన/ విశ్వదాభిరామ వినురవేమ!"
అనగా  సాధనమున పనులు తప్పకుండా సాధ్యం అవుతాయి.బద్ధకించ కుండా  చేసే పనులు తప్పకుండా విజయం సాధిస్తాయి.తినగా తినగా వేపాకు తియ్యగా అనిపిస్తుంది అంటే నోటికి అలవాటై పోతుంది. తీయంగా తీయంగా రాగం చక్కగా కుదురుతుంది.
 కాబట్టి సాధన చేస్తే సాధ్యం కానిది ఏది లేదని ఈ "ఘటారోహణ న్యాయము"మనకు చెబుతుంది.
 కాబట్టి ఏదైనా సాధించాలనే తపన ఉండాలే కానీ అసాధ్యం అనేది ఏదీ లేదని ఈ న్యాయము ద్వారా తెలుసుకున్నాం కదా! మరి మనకు నచ్చిన,అందరు  మెచ్చే కళను సాధన చేద్దాం.అందరితో గొప్ప కళాకారులుగా ప్రశంసలు పొందుదాం.

కామెంట్‌లు