సునంద భాషితం- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-505
చిత్రపట న్యాయము
    ******
చిత్రము అనగా చిత్తరువు,బొమ్మ,ఒక వస్తువు యొక్క ప్రతిబింబము.పటము అనగా అది ఒక వస్తువు. దీనిలో ఎవ్వరిదైనా చిత్రమును ఉంచి గోడకు తగిలిస్తారు. 
చిత్ర పట న్యాయము అనగా  ఇక్కడ ముందు రేఖలు గీసి తర్వాత బొమ్మను గీసినట్లు అనే అర్థంతో చెప్పబడింది.
చిత్ర పటము గీయడం అఃదులోనూ రేఖలతో  చిత్రాలు గీయడం ఒక గొప్ప కళ. ఇది ఒక దృశ్య కళ.ఈ కళను మన భారతీయులు వందల సంవత్సరాల క్రితమే గోడల మీద,కట్టుకునే బట్ఠల మీద, తాటాకుల చిత్రాలు గీసి ప్రదర్శించారు.
స్వరం,తీవ్రత,లయ ఎలా అయితే సంగీతంలో ప్రధాన అంశాలు అవుతాయో రంగు,సంతృప్తత, రేఖలు ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
కొండల మీద ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళను రాతితో చెక్కి , ఎప్పటికీ  చెరగని రంగులు ఉపయోగించి బొమ్మలు గీసిన ప్రాచీన ఆదిమానవుల చిత్రకళ చూస్తుంటే నేటికీ అత్యద్భుతంగా అనిపిస్తుంది.
ప్రపంచ దేశాల్లో  ఆదిమానవులను, గిరిజనులను చూసినట్లయితే వారి భాష ,ఆహార్యం ,ఆహారం అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. అలాగే వారి చిత్ర కళ కూడా... గుహల్లో గీసిన బొమ్మల్లో  రేఖలు ప్రత్యేకత సంతరించుకోవడం కనిపిస్తుంది.
 ఆధునిక  విద్యారంగంలో   ఇలాంటి కళలను మానవీయ శాస్త్రాలలో ఉప సమితిగా చెప్పడం జరిగింది.ఈ కళలను ఏడు వర్గాలుగా విభజించారు. వాటిల్లో పెయింటింగ్స్ వేయడం, ఆర్కిటెక్చర్, శిల్పం, సాహిత్యం, సంగీతం, ప్రదర్శన మరియు సినిమా ముఖ్యమైనవి.
 సాధారణంగా ఏ కళ అయినా అందులో వ్యక్తి యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు, నమ్మకాలు లేదా ఆలోచనలను ఇంద్రియాల ద్వారా బహిర్గతం చేయిస్తుంది.ఇది మంచి ప్రయోజనకారి కూడా.ఈ ప్రయోజనం  గీసిన కళాకృతులలో, చిత్రాల్లో వస్తువుల్లో స్పష్టంగా  కనిపిస్తుంది.
ఈ విధంగా కళ అనేది వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, భావాన్ని సూచిస్తుంది. మాట్లాడే లేదా లిఖిత భాషతో ముడిపడకుండా ఊహలను వ్యక్తం చేయడానికి ఈ చిత్ర కళ ఒక మార్గాన్ని అందిస్తుంది.
 ఏ కళాకారుడైనా  మొదట తన మనసులోని కళను ఊహించుకుని, దానికి ఉనికిని కల్పించే ప్రయత్నం మొదలు పెడతాడు.
ఇక రేఖా చిత్రాల విషయానికి వస్తే ఇది కదిలే చుక్కగా పరిగణించబడే కళ కాబట్టి ఇందులో రేఖ అనేది ప్రాథమిక మరియు ఆకారాల యొక్క దృశ్యమాన నిర్వచనంగా వుండి భావోద్వేగం, రూపం, ఆకృతి మరియు చలనాన్ని వ్యక్తీకరించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఒక్కో రేఖ ముఖ్యమైన సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పని చేస్తుందన్న మాట.
మరి ఈ చిత్రపట న్యాయమును  మన పెద్దలు ఎందుకు  వ్యక్తులకు వర్తింపజేసి  చెప్పారో చూద్దాం.
 ముఖ్యంగా ఏ కళకైనా  ఏకాగ్రత, నిశిత పరిశీలనా శక్తి, ఊహల వ్యక్తీకరణ, నిర్థిష్టమైన ప్రామాణికత, భావోద్వేగం, నమ్మకము , సామర్థ్యము, నైపుణ్యం మొదలైనవి తప్పని సరిగా కావాలి.
 ఇక రేఖా చిత్రపటం గీసే  కళాకారుడు ముందుగా ఫలానా వ్యక్తిని గానీ, వస్తువును,ప్రకృతిని కానీ  రేకులతో లేదా గీతలతో మొదలు పెట్టి , అనగా ఒక అస్థిపంజరంలానో ,అవతలి  గీతలో గీసుకుని దానికి జీవత్వం ఉట్టిపడేలా రంగులు, మెరుగులు దిద్దడం  జరుగుతుంది.
 ఇదంతా చేయాలి అంటే ముందు ఉండాల్సింది ఓర్పు,ఆ తర్వాత నేర్పు.దానితో బాటు అంకిత భావం...ఇవన్నీ వ్యక్తులు  ఏ కళను సాధన చేయడానికైనా ఉండాలని చెప్పడానికే ఈ న్యాయమును సృష్టించి వుంటారని మనం అర్థం చేసుకోవచ్చు.
  అలాంటి కళను ఔపాసన పట్టిన రాజా రవివర్మ, వడ్డాది పాపయ్య, శంకర నారాయణ,బాలి, బాపు మొదలైన వారు ఎందరో గొప్ప చిత్రకారులు. వారి చిత్రకళా నైపుణ్యంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
  ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనలో  అంతర్గతంగా  ఏదైనా చక్కని కళ దాగి ఉన్నట్లయితే దానిని వెలికి తీసి చక్కగా సాధన  చేసి  తద్వారా అందరితో శభాష్ అనిపించుకోవాలి. ఇదండీ ఈ న్యాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి మనలో ఏ కళ ఉందో ఆ కళకు  సానబెట్టుకుందామా..!.


కామెంట్‌లు