శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు.
11.
రామ రామా!యని బిలువ రక్షసేయు
రావణాసురవైరి!మా రాజువయ్య!
పూర్ణరూపుడా!నాకింత పుణ్యమొసగి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

12.
ధర్మపాలన జేయంగ ధరణి యందు
దాశరథిగ కౌసల్యకు తనయుడయిన
పరమపురుష!నిన్ బొగడంగ తరమ నాకు?
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
13.
వనము లందున్న ఘనమైన మునుల కెల్ల
మేలు చేయంగ నిలిచిన మేటి వీవు
రాక్షసాంతక!నాపైని లలిని జూపి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
14.
సేతుబంధన మొనరించి సీతఁదెచ్చి
జగమునేలిన పరమాత్మ జయము! జయము!
రవికులాంభోనిధి!వరద!రామచంద్ర!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ//
15.
హలముపట్టిన వీరుడా!బలిమి నిమ్ము!
ఘనుడ!బలరామ!కరుణతో గనుము నన్ను!
చిన్ని కృష్ణుని సోదరా!చింతదీర్చి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు