క్షౌరం- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మంత్రసాని పురుడు పోస్తేనేకదా
మన అయ్యవ్వలు కన్ను తెరిచింది
మంగళవాయిద్యాలు మోగితేనేకదా
మనపెండ్లికి కళ వచ్చేది
పొద్దెక్కకముందే గడ్డాలు గీయించుకుంటేనేకదా
నీటుగాడిలా బీటువేసేది
ఆ దువ్వెనసాలు నడిస్తేనేకదా
నిక్కపొడుచుకున్న వెంట్రుకలు సాగిలపడేది
ఆ పరపరలకత్తెర నాట్యం చేస్తేనేకదా
జుంపాలజుట్టు కుదురుగా కూర్చునేది
ఆ క్షౌరపుకత్తి తళతళా మెరిస్తేనేకదా
బొచ్చుగుండు బోడిగుండయ్యేది
గోరుగల్లు గొప్ప వాడిగా ఉంటేనేకదా
ముళ్ళేకాదు గోర్లూ ఆనెలూ తెగకోసేది
పెండ్లిబాసింగాలేకాదు చావుకర్మకాండల్లోనూ,
దేవుడి ఊరేగింపుల్లోనూ,వైద్యసేవల్లోనూ
నాయీబ్రాహ్మణుడులేకుంటే తరుణోపాయమేలేదు
కాని, ప్రపంచీకరణ సునామీలో
క్షురకం గందరగోళానికి గురిఅయింది
ఓటుబ్యాంకు రాజకీయం అభివృద్ధిని మింగేసింది
ప్రజాస్వామ్యరీతిలో నాయకుల వక్రబుధ్ధిని
తక్షణం క్షౌరం చేయాల్సిందే!!!
**************************************

కామెంట్‌లు