తొందరేల నెచ్చెలీ- జి జి రావు,తుని-కాకినాడ జిల్లా
కుసుమ ధర్మన్న కళాపీఠం
 ====================
ఎందుకో నీకింత ఆలోచన 
ఏమాయెనని ఆ చింత 
వస్తానన్న వాడు రాదేలనోయనా!
మాట తప్పనివాడు తప్పుకున్నాడనా!

ప్రశాంత సమయాన 
వింత పోకడలెందుకు చెలీ!
ఎప్పుడూ కలిసేది ఇక్కడనే కదూ 
తటాకపు ఒడ్డున మంటపాన 
చేతిలో చేయుంచి చేసుకున్న బాసలు 
మరచిపోయాడేమనా  సఖీ!

నను తలచుకుని, నాకిష్టమని 
నీలిరంగు వలువలు ధరించి 
నను తలపోస్తూ మధన పడుతున్నావా!
నిను చూసి ప్రకృతి పక్కున నవ్వుతుంది 
చెట్టు మీదున్న గువ్వల జంట గుసగుసలాడుతుంది..
సాయంకాల చల్లని సమీరాలు
గీష్మపు గాలులుగ మారిపోతున్నాయి 
పెదవిని నొక్కిపట్టిన కోపం 
బయటపడడానికి తొందర పడుతుంది..

కానీ.. నీకు తెలియంది ఒకటుంది తెలుసా..
నీ వెనకనే నే వచ్చానని 
ఆ చెట్టు చాటున పొంచి చూస్తున్నానని..
నా చెలి బుగ్గలమీద కెంపురంగు 
చూడాలన్న ఈ నా ఆశ తీర్చుకొనెదెలా!
అందుకేనోయీ.. ఈ ఆలస్యానికి కారణం.
వెను తిరిగి చూడకు సుమీ..
నీ కనురెప్పల మాటున దాగిన కన్నీరు 
క్రింద పడనీయకోయి.. 
నామనసు గాయపడుతుంది 
నిను హత్తుకుని నీ అలకను బంధించనూ..
నా మాట నెగ్గించుకుని నీ ముందుకు రానూ..

కామెంట్‌లు