సుప్రభాత కవిత ; -బృంద
వేసవిలో వేడెక్కిన నేలకు 
నింగి పంపిన నీటి చుక్కల ప్రేమసందేశం చదువుకుని పులకరిస్తోన్న పుడమి

చినుకు చినుకులో చిందే
నింగి ప్రేమను చివరంటా
ఒడిసిపట్టి  ఎదనిండుగా
నింపుకుని పరిమళించె అవని

వరుణుడి రాకకు పరవశించి
చెట్టూ పుట్టా తడిసి మురిసి
కొమ్మారెమ్మా ఊపుతూ ఆనందంగా
ప్రకృతి అభ్యంగనమాచరించె

అణిగి అలసిన మనసుకు
అంతులేని తృప్తి కలిగేలా
కనిపించని సెగల వేడిని
మరిపించే మధురమైన భావంలా

పొగలు సెగలైన గ్రీష్మానికి
తాపం తగ్గేలా తమాయించమని
కోపం వద్దని అనునయిస్తూ
మబ్బులమాటున పొంచిన వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు